క్రమశిక్షణతో రాష్ట్రాలు మహమ్మారిని జయిస్తున్నాయి : జితేంద్ర సింగ్

ABN , First Publish Date - 2020-05-09T19:26:03+05:30 IST

అత్యంత క్రమశిక్షణతో రాష్ట్రాలు కరోనా వైరస్‌ను జయించే దిశగా పయనిస్తున్నాయని ఈశాన్య రాష్ట్రాల

క్రమశిక్షణతో రాష్ట్రాలు మహమ్మారిని జయిస్తున్నాయి : జితేంద్ర సింగ్

న్యూఢిల్లీ : అత్యంత క్రమశిక్షణతో రాష్ట్రాలు కరోనా వైరస్‌ను జయించే దిశగా పయనిస్తున్నాయని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖా మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా ఆయన సిక్కిం రాష్ట్రాన్ని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ అక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని, సాంఘికంగా, సాంస్కృతిక పరంగా అత్యంత క్రమశిక్షణతో ఉన్న రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేశాయని ప్రశంసించారు. ఇలా చేయడం ద్వారానే మహమ్మారి వ్యాపించకుండా అడ్డుకట్ట వేశారని ఆయన పేర్కొన్నారు. ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.


కరోనాను ఎదుర్కోవడంలో ఈశాన్య రాష్ట్రాలు ఓ ఉదాహరణగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. ‘‘భారతీయులు కోరోనాతో జీవించడం నేర్చుకున్నారా? అని ఆయన్ను ప్రశ్నించగా... ‘‘అవును... అది నిజం. వైరస్‌తో జీవించడం నేర్చుకున్నారన్నది నిజం. ఓ వైద్యునిగా చెబుతున్నాను. ఈ లాక్‌డౌన్‌తో క్రమశిక్షణ కూడా నేర్చుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా క్రమశిక్షణతోనే జీవిస్తారు’’ అని ఆయన పేర్కొన్నారు.


లాక్‌డౌన్ విధించిన తర్వాత ప్రజల్లో కాస్త భయం ఏర్పడిందని, అది తొందరగా ప్రజల మెదళ్లోంచి తీసేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. లాక్‌డౌన్ కారణంగా అనేక మంది తమ ఉద్యోగాలను కోల్పోయారని, ఈ విషయంలో ప్రభుత్వం తొందర్లోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని, ఎవరికీ నష్టం కలగకుండా చూస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి గ్రహణ శక్తి బాగా ఉందని, అందుకే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని జితేంద్ర సింగ్ ప్రశంసించారు.

Updated Date - 2020-05-09T19:26:03+05:30 IST