జయ మృతిపై కీలక వ్యాఖ్యలు చేసిన స్టాలిన్

ABN , First Publish Date - 2020-10-19T16:03:41+05:30 IST

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలిచి అధికారంలోకి రాగానే దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై సమగ్ర విచారణ జరుపుతామని స్టాలిన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జయ మృతి వెనుక దాగిన కుట్రను బహిర్గతం చేస్తామన్నారు. సుప్రీంకోర్టులో దాఖలైన అప్పీలు పిటిషన్‌పై ప్రభుత్వ తరఫు

జయ మృతిపై కీలక వ్యాఖ్యలు చేసిన స్టాలిన్

చెన్నై : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలిచి అధికారంలోకి రాగానే దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై సమగ్ర విచారణ జరుపుతామని స్టాలిన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జయ మృతి వెనుక దాగిన కుట్రను బహిర్గతం చేస్తామన్నారు. సుప్రీంకోర్టులో దాఖలైన అప్పీలు పిటిషన్‌పై ప్రభుత్వ తరఫు న్యాయవాదులు సక్రమంగా వాదించడం లేదని  విమర్శించారు. జయ మృతిపై విచారణ జరుపుతున్న రిటైర్డ్‌ జడ్జి ఆరుముగసామి కమిటీ ఆరోపణలు చేయడం దిగ్ర్భాం తి కలిగిస్తోందన్నారు. ఇక ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం తమ పదవుల కోసం విచారణ కమిటీని సక్రమంగా పనిచేయకుండా స్తంభింపజేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. 


జయలలిత మృతి వెనుక దాగిన కుట్రను వెలికి తీసేందుకు అన్నాడీఎంకే పాలకులు ప్రయత్నించకుండా విచారణ కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నట్లు రాష్ట్రప్రజలందరూ అనుమాన పడుతున్నారన్నారు. జయ మృతిపై విచారణ జరుపుతున్న కమిటీ తమను తప్పుబట్టే రీతిలో సాగుతోందని ఆరోపిస్తూ అపోలో ఆస్పత్రి యాజమాన్యం సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకుని స్టే తెచ్చుకుందన్నారు. అయితే ఆ స్టేను తొలగించే దిశగా ప్రభుత్వ తరఫు న్యాయవాదులు తగు చర్యలు తీసుకోలేదని కమిటీ అధికారి జస్టిస్‌ ఆరుముగసామి ఆరోపణలు చేయడం దిగ్ర్భాంతి కలిగిస్తోందన్నారు. జస్టిస్‌ ఆరుముగసామి అన్నాడీఎంకే ప్రభుత్వానికి రాసిన లేఖ బహిర్గతమైందని, జయలలిత మృతిపై కుట్రదాగి ఉందని గతంలో మంత్రులు చేసిన ఆరోపణలపై కమిటీ విచారణ జరపకుండా పాలకులు అడ్డుకుంటున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. జయలలిత మృతి చెందినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఆ విచారణ కమిటీ విచారణకు హాజరుకాలేదని, జయలలిత మృతిలో దాగిన మర్మాలు బహిర్గతం చేయడానికి ధర్మయుద్ధం చేస్తానని గొప్పలు చెప్పుకున్న ఆయన మౌనం పాటిస్తున్నారని స్టాలిన్‌ పేర్కొన్నారు. తొలుత జయ మృతిపై సీబీఐ విచారణ జరపాలని కూడా పన్నీర్‌సెల్వం పట్టుబట్టిన విషయాన్ని రాష్ట్రప్రజలు మరువలేదన్నారు. జయ మృతిపై తాను చేసిన డిమాండ్లను అన్నాడీఎంకే ప్రభుత్వం ఆమోదించకపోయినా పన్నీర్‌సెల్వం కేంద్రంలోని బీజేపీ పాలకుల ఒత్తిడికి లొంగి ప్రభుత్వంలో భాగస్వామిగా మారిపోయారని స్టాలిన్‌ విమర్శించారు. 2017 సెప్టెంబర్‌ 25న ఎడప్పాడి ప్రభుత్వం జయ మృతిపై విచారణ జరిపేందుకు రిటైర్డ్‌ జడ్జి ఆరుముగసామి నాయకత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసిందని, మూడు  నెలల్లో విచారణ జరిపి నివేదికను సమర్పించాలని ఉత్తర్వులు కూడా జారీ చేసిందన్నారు. అయితే కమిటీ ఏర్పాటై ఇప్పటికే 37 నెలలు గడిచినా విచారణ పూర్తి కాలేదని, పైగా  కమిటీ గడువును ప్రభుత్వం పొడిగిస్తూ వస్తోందన్నారు. జయలలిత మృతి కేసులో ప్రధాన నిందితుడు పన్నీర్‌సెల్వం అని ఆరోగ్యమంత్రి విజయభాస్కర్‌ చేసిన ఆరోపణ చేసిన విషయాన్ని కూడా స్టాలిన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంత్రి ఆరోపణపై స్పందించిన ఆరుముగసామి కమిటీ 2018 డిసెంబర్‌ 12న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని పన్నీర్‌సెల్వంకు సమన్లు పంపినా ఆయన పట్టించుకోలేదన్నారు. కమిటీ సమన్లు జారీ చేసి 22 నెలలు  గడిచినా పన్నీర్‌సెల్వం విచారణ కమిటీ ఎదుట హాజరుకాలేదని, ‘న్యాయపోరాటం జరపడంలో భయమెరుగని పులిలాంటి వ్యక్తి’నని గొప్పలు చెప్పుకునే పన్నీర్‌సెల్వం పిల్లిలా వ్యవహరించడం భావ్యమేనా అని స్టాలిన్‌ ప్రశ్నించారు. 


జయ మృతిపై సీబీఐ విచారణ కోరుతూ ధర్మయుద్ధం జరిపిన పన్నీర్‌సెల్వం, తాజాగా సీఎం అభ్యర్థిగా తనను ప్రకటించాలంటూ ‘ధర్మయుద్ధం-2’ జరిపి అభాసుపాలయ్యారన్నారు. అపోలో ఆస్పత్రి యాజమాన్యం సుప్రీంకోర్టుకు వెళ్లి విచారణ కమిటీపై స్టే తెచ్చుకుని నెలలు గడిచినా దాన్ని తొలగించడానికి ప్రభుత్వ తరఫు న్యాయవాదులు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా మౌన ప్రేక్షకుల్లా ఉన్నారని జస్టిస్‌ ఆరుముగసామి ఆరోపణలు చేసినా పాలకులు స్పందించకుండా ఉన్నారని స్టాలిన్‌ ఆరోపించారు. అపోలో ఆస్పత్రి యాజమాన్యం సుప్రీంకోర్టులో వాయిదాలు కోరుతున్నా ప్రభుత్వ తరఫు న్యాయవాదులు ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదని జస్టిస్‌ ఆరుముగసామి ఆరోపించడం సాదాసీదా విషయం కాదన్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో డీఎంకే  అధికారంలో రాగానే జయలలిత మృతిపై సమగ్ర విచారణ జరిపి, ఆమె మృతి వెనుక దాగిన కుట్రను బహిర్గతం చేస్తుందని స్టాలిన్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2020-10-19T16:03:41+05:30 IST