బ్యాంకర్‌గా రిటైరయ్యాక డాక్టర్ చదువు
ABN , First Publish Date - 2020-12-27T09:08:28+05:30 IST
ఆసక్తి ఉండాలేగానీ.. విద్యాభ్యాసానికి వయస్సు అడ్డేముంది? చదువు విషయంలో 20ల్లో తీరని ముచ్చట్లను 60ల్లో నెరవేర్చుకోవచ్చని

64 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ సీటుతో జయ కిశోర్ ప్రదాన్ రికార్డు
భువనేశ్వర్, డిసెంబరు 26: ఆసక్తి ఉండాలేగానీ.. విద్యాభ్యాసానికి వయస్సు అడ్డేముంది? చదువు విషయంలో 20ల్లో తీరని ముచ్చట్లను 60ల్లో నెరవేర్చుకోవచ్చని నిరూపించారు ఒడిసాకు చెందిన జయ్ కిశోర్ ప్రధాన్ అనే విశ్రాంత బ్యాంకర్. 64 ఏళ్ల వయసులో జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష (నీట్)ను అధిగమించి.. ఒడిశాలోని ప్రఖ్యాత వైద్య విద్యాసంస్థ వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (వీఐఎంఎ్‌సఏఆర్)లో సీటు సంపాదించారాయన. చిన్నతనం నుంచే డాక్టర్ అవ్వాలనే కోరిక ఉన్నా.. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ ఆలోచనను విరమించుకున్న ఆయన.. తన కవల కూతుళ్లలో ఒకరు చనిపోయాక జీవిత చరమాంకం వరకు వైద్య సేవ చేయాలనే ఉద్దేశంతో ఎంబీబీఎ్‌స లో సీటు కోసం ప్రయత్నించారు. ‘‘నేను అప్పట్లో ఎంబీబీఎస్ కోసం ప్రవేశ పరీక్ష రాసి విఫలమయ్యాను. బీఎస్సీలో చేరాను. తొలినాళ్లలో టీచర్‌గా పనిచేశాను. 1983లో ఇండియన్ బ్యాంకులో.. ఆ తర్వాత భారతీయ స్టేట్ బ్యాంక్‌లో పనిచేశాను’’ అని జయ్ కిశోర్ వివరించారు. 2016లో ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజర్‌గా రిటైర్ అయిన ఆయన.. నీట్‌కు సన్నద్ధమవుతున్న తన కవల కూతుళ్లకు పాఠాలు చెప్పారు. అప్పట్లో 25 ఏళ్లలోపు వారే అర్హులు అనే నీట్ నిబంధనలతో తాను పరీక్ష రాయలేదు. 2018లో నీట్‌కు వయోపరిమితిని సుప్రీంకోర్టు ఎత్తివేయడంతో నీట్-2020 రాసి మంచి ర్యాంకు సాధించారు. దివ్యాంగుల కోటాలో వీఐఎంఎ్‌సఏఆర్‌లో సీటు సాధించారు. ‘‘నేను ధనార్జన కోసం ఈ నిర్ణయం తీసుకోలేదు. బతికున్నంతకాలం పేదలకు ఉచితంగా వైద్యం అందించాలన్నదే నా లక్ష్యం’’ అని జయ్ కిశోర్ చెబుతున్నారు. ఆయన కవల కూతుళ్లిద్దరూ 2016లో బీడీఎ్‌సలో సీటు సంపాదించారు. వారిలో ఒకరు అనారోగ్యంతో చనిపోయారు.