ఇళ్లలోనే కృష్ణాష్టమి వేడుకలు... టీవీల ముందు భక్తులు!
ABN , First Publish Date - 2020-08-11T14:01:13+05:30 IST
ఈరోజు దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్ననేపధ్యంలో ఈసారి మధురతో సహా పలు ప్రధాన దేవాలయాలలో భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు.

న్యూఢిల్లీ: ఈరోజు దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్ననేపధ్యంలో ఈసారి మధురతో సహా పలు ప్రధాన దేవాలయాలలో భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. ఇలాంటి పరిస్థితుల్లో భక్తులు తమ ఇళ్లలోనే చిన్నికృష్ణునికి స్వాగత సత్కారాలు చేస్తున్నారు. ఈసారి శ్రీ కృష్ణ జన్మాష్టమి వరుసగా రెండు రోజులు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా యూపీలోని మధురకు చెందిన శ్రీ కృష్ణ జన్మస్థాన సేవా సంస్థ కార్యదర్శి కపిల్ శర్మ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం, బ్రిజ్‌లోని అన్ని దేవాలయాల నిర్వాహకులు మధ్య జరిగిన చర్చలలో కరోనా వైరస్ కట్టడికి సంబంధించిన మార్గదర్శకాలను పాటించాలని నిర్ణయించారు. ఈ నేపధ్యంలోనే మధుర, బృందావన్, గోవర్ధన్, బర్సనా, నందగావ్, గోకుల్, మహావన్, బల్దేవ్ తదితర అన్ని పుణ్యక్షేత్రాలను ఈనెల 13వ తేదీ మధ్యాహ్నం వరకు మూసివేయనున్నారు. భక్తుల రద్దీ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నామన్నారు. భక్తులు దూరదర్శన్‌తో పాటు ఇతర ఛానెళ్లలో శ్రీకృష్ణ జన్మోత్సవాలను చూడవచ్చని కపిల్ శర్మ తెలిపారు.