జమ్మూ, శ్రీనగర్‌లలో త్వరలో మెట్రోరైలు కూత

ABN , First Publish Date - 2020-12-15T11:58:12+05:30 IST

జమ్మూ, శ్రీనగర్ నగరాల్లో త్వరలో మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మించాలని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా...

జమ్మూ, శ్రీనగర్‌లలో త్వరలో మెట్రోరైలు కూత

జమ్మూ: జమ్మూ, శ్రీనగర్ నగరాల్లో త్వరలో మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మించాలని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన సివిల్ సచివాలయంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించారు. జమ్మూ నగరంలో 23 కిలోమీటర్ల దూరం 22 రైల్వేస్టేషన్లతో బంటలాబ్ నుంచి బారి బ్రాహమన వరకు లైట్ రైల్ సిస్టమ్ నిర్మించాలని ప్రతిపాదించారు. శ్రీనగర్ లో 25 కిలోమీటర్ల దూరం మెట్రోరైలు మార్గాన్ని నిర్మించాలని లెఫ్టినెంట్ గవర్నరు సూచించారు. శ్రీనగర్ లో ఇందిరానగర్ నుంచి హెచ్ఎంటీ జంక్షన్ వరకు 12.5 కిలోమీటర్లు,  హజారీబాగ్ నుంచి ఉస్మానాబాద్ వరకు 12.5 కిలోమీటర్ల దూరం మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. 


లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో చీఫ్ సెక్రటరీ బీవీఆర్ సుబ్రహ్మణ్యం, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ధీరజ్ గుప్తా, ఇతర అధికారులు పాల్గొన్నారు. జమ్మూ, శ్రీనగర్ లలో మెట్రో రైలు కారిడార్ల నిర్మాణం  గురించి కేంద్ర అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రెండు ప్రధాన నగరాల్లోనూ వేగంగా మెట్రోరైలు నిర్మాణ పనులు చేపట్టి రెండేళ్లలోగా పూర్తి చేయాలని లెఫ్టినెంట్ గవర్నరు మనోజ్ సిన్హా అధికారులను ఆదేశించారు. జమ్మూకశ్మీరులో మెట్రోరైళ్ల నిర్మాణం వల్ల ప్రయాణికులకు సౌకర్యం ఏర్పడటంతోపాటు ఆర్థికాభివృద్ధికి ఊతం ఇస్తుందని మనోజ్ సిన్హా చెప్పారు. 

Updated Date - 2020-12-15T11:58:12+05:30 IST