జమ్మూకశ్మీర్‌లో కొత్త పార్టీ ఆవిర్భావం
ABN , First Publish Date - 2020-03-08T20:24:39+05:30 IST
జమ్మూకశ్మీర్ రాజకీయ వేదికపై మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. 'జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ' (జేకేఏపీ)ని పీడీపీ మాజీ నేత, గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన..

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ రాజకీయ వేదికపై మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. 'జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ' (జేకేఏపీ)ని పీడీపీ మాజీ నేత, గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన సైయద్ అల్టాఫ్ బుఖారి ఆదివారంనాడు శ్రీనగర్‌లో లాంఛనంగా ప్రారంభించారు. పీడీపీ, ఎన్‌సీ, కాంగ్రెస్‌కు చెందిన 40 మంది మాజీ ఎమ్మెల్యేలు ఈ పార్టీలో చేరారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆరు నెలల తర్వాత జమ్మూకశ్మీర్‌లో కొత్త రాజకీయ శక్తి అవతరించడం ఇదే మొదటిసారి.
కొత్త పార్టీని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం బుఖారి మీడియాతో మాట్లాడుతూ, ఇది కుటుంబ పార్టీ కాదని, ఇది సామాన్యుల కోసం, సామాన్యుల చేత ఏర్పడిన పార్టీ అని అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎవరైనా సరే రెండు సార్లకు మించి అధ్యక్ష పదవిలో కొనసాగరాదన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, ప్రతిష్టను కాపాడేందుకు, కశ్మీర్ పండిట్లు తిరిగి రావడానికి కట్టుబడి ఉంటామని, మహిళలు, యువకుల సాధికారతకు పెద్దపీట వేస్తామని చెప్పారు. పూర్తి ఆశావహ దృక్పథం, నిజాయితీ, నిష్పాక్షికతతో పార్టీ ఏర్పాటు చేశామని, ఈ రాజకీయ ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములేనని అన్నారు. జమ్మూకశ్మీర్ ఎన్నో త్యాగాలు చేసిందని, ప్రజల కలలు సాకారం చేసేందుకు పార్టీ కృషిచేస్తుందని బుఖారి చెప్పారు.