కాఫీ గింజ‌ల్లో కొకైన్‌... పోలీసులు ఎలా ప‌సిగ‌ట్టారంటే...

ABN , First Publish Date - 2020-07-20T18:47:24+05:30 IST

ఇటలీ పోలీసులు అనుమానాస్ప‌దంగా క‌నిపించిన‌ కాఫీ గింజ‌ల బ్యాగుల‌ను స్వాధీనం చేసుకున్నారు. తరువాత వారు ప్రతీ కాఫీ విత్తనాన్ని చీల్చి చూశారు. ఆ కాఫీ గింజ‌ల‌లో కొకైన్ ఉండ‌టాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయారు....

కాఫీ గింజ‌ల్లో కొకైన్‌... పోలీసులు ఎలా ప‌సిగ‌ట్టారంటే...

రోమ్‌: ఇటలీ పోలీసులు అనుమానాస్ప‌దంగా క‌నిపించిన‌ కాఫీ గింజ‌ల బ్యాగుల‌ను స్వాధీనం చేసుకున్నారు. తరువాత వారు ప్రతీ కాఫీ విత్తనాన్ని చీల్చి చూశారు. ఆ కాఫీ గింజ‌ల‌లో కొకైన్ ఉండ‌టాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయారు.  స్మగ్లర్లు ఎన్నిర‌కాలుగా త‌మ అక్ర‌మ కార్య‌క‌లాపాలు సాగిస్తున్నా, పోలీసులు వారి ఎత్తుగ‌డ‌ల‌ను చిత్తుచేస్తూ వ‌స్తున్నారు. ఈ విధంగా కాఫీ గింజల లోపల కొకైన్ దాచి, స్మ‌గ్లింగ్ చేయ‌డం ఇది మొద‌టిసార‌ని పోలీసులు అంటున్నారు. పైకి చూసేందుకు ఆ కాఫీ గింజ‌ల బ్యాగు సాధార‌ణంగానే క‌నిపించిన‌ప్ప‌టికీ, దానిపై ‘జాన్ విక్‌: చాప్ట‌ర్‌-2’ కు చెందిన మాఫియా బాస్ సెంటినో డీ ఆంటోనియా అనేపేరు ఉంది. దీంతో పోలీసుల‌కు అనుమానం క‌లిగింది. వారు ఆ బ్యాగుల‌ను త‌నిఖీ చేశారు. 500 కాఫీ గింజ‌ల‌ను తొలిచి చూడ‌గా, వాటిలో కొకైన్ ల‌భ్య‌మ‌య్యింది. మీడియాకు అందిన స‌మాచారం ప్ర‌కారం ఈ కాఫీ గింజ‌ల్లో 150 గ్రాముల కొకైన్ ల‌భించింది. స్మ‌గ్ల‌ర్లు కాఫీ గింజ‌ల‌లో కొకైన్ దాచి, దానికి టేప్ వేశారు. వాటిని సాధార‌ణ కాఫీ గింజ‌ల్లో క‌లిపివేశారు. అయితే కొకైన్ దాచిన కాఫీ గింజ‌ల‌పై క‌ల‌ర్ కాస్త తేడాగా క‌నిపించ‌డంతో పోలీసుల‌కు అనుమానం వ‌చ్చి, వాటిని తొలిచి చూశారు. దీంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. కాగా ఈ కాఫీ గింజ‌ల‌ను కొలంబియా నుంచి మిలాన్‌లోని మాల్‌పెంసా ఎయిర్‌పోర్టుకు త‌ర‌లిస్తున్నార‌ని పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారంలో పోలీసులు 50 ఏళ్ల వ్య‌క్తి‌ని అరెస్టు చేసి, విచార‌ణ జ‌రుపుతున్నారు. 

Updated Date - 2020-07-20T18:47:24+05:30 IST