చైనా, క్యూబాల్లోని అమెరికా దౌత్యవేత్తల అస్వస్థతకు కారణం అదేనా?

ABN , First Publish Date - 2020-12-06T23:09:36+05:30 IST

చైనా, క్యూబాల్లోని అమెరికా దౌత్యవేత్తలు అంతుబట్టని అస్వస్థతతో

చైనా, క్యూబాల్లోని అమెరికా దౌత్యవేత్తల అస్వస్థతకు కారణం అదేనా?

న్యూఢిల్లీ : చైనా, క్యూబాల్లోని అమెరికా దౌత్యవేత్తలు అంతుబట్టని అస్వస్థతతో బాధపడటానికి కారణం మైక్రోవేవ్ రేడియేషన్ అయి ఉండవచ్చునని తాజా నివేదిక వెల్లడించింది. 2016 నుంచి ఈ దేశాల్లోని అమెరికా దౌత్యవేత్తలను గుర్తు తెలియని వ్యాధులు పీడిస్తుండటంతో అమెరికన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ తాజా నివేదికను శనివారం సమర్పించింది. 


నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కమిటీ శనివారం సమర్పించిన నివేదికలో హవానాలో అమెరికా దౌత్య సిబ్బందిని వేధించిన అంతుబట్టని అస్వస్థతలకు కారణాలను వెల్లడించింది. తీవ్రమైన తలనొప్పి, మగత, జ్ఞాన సంబంధమైన ఇబ్బందులు వంటి లక్షణాలకు కారణం చాలా వరకు డైరెక్టెడ్, పల్స్‌డ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అని చెప్పవచ్చునని తెలిపింది. గతంలో ఈ లక్షణాలకు కారణం ట్రాపికల్ డిసీజ్, సైకలాజికల్ ఇస్యూస్ అని భావించినట్లు, ఈ భావన కన్నా డైరెక్టెడ్, పల్స్‌డ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ కారణంగానే వీరిని అంతుబట్టని అస్వస్థత వేధించినట్లు చెప్పడం చాలా వరకు సరైనది అవుతుందని తెలిపింది. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ నివేదిక వెల్లడించలేదు. 


ఈ మెడికల్ మిస్టరీని ఛేదించేందుకు చాలా శ్రమించినట్లు ఈ నివేదిక పేర్కొంది. బాధితులందరి లక్షణాలు ఒకే విధంగా లేకపోవడాన్ని ప్రస్తావించింది. ఈ కమిటీ చైర్మన్, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో మెడిసిన్ ప్రొపెసర్ డేవిడ్ రెల్మన్ మాట్లాడుతూ, ఈ కేసుల పట్ల తమ కమిటీ తీవ్ర ఆందోళన చెందుతోందన్నారు. దీనికి కారణాలను వివరిస్తూ, డైరెక్టెడ్, పల్స్‌డ్ రేడియోఫ్రీక్వెన్సీ ఎనర్జీని ఓ మెకానిజంగా ఉపయోగించడం; దౌత్యవేత్తలు, సిబ్బంది తీవ్రంగా బాధపడుతుండటం, బలహీనపడటం ఆందోళనకరమని చెప్పారు. ఈ నిర్దిష్ట కేసులను, అదేవిధంగా, భవిష్యత్తులో ఎదురయ్యే కేసులను సమన్వయంతో, సమగ్రంగా పరిష్కరించవలసిన అవసరం ఉందన్నారు. 


2017లో క్యూబాలో ఉన్న అమెరికన్ ఎంబసీలోని సుమారు 26 మంది అమెరికన్ దౌత్యవేత్తలు, చైనాలో ఉన్న అమెరికన్ కాన్సులేట్‌లోని కెనడియన్ డిప్లమేట్స్, సిబ్బంది అస్వస్థులయ్యారు. వీరిలో కొందరు అమెరికా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించడం లేదని ఆరోపిస్తూ స్టేట్ డిపార్ట్‌మెంట్‌పై కేసు దాఖలు చేశారు. 2016-2018 మధ్య కాలంలో హవానాలోని అమెరికా, కెనడా దౌత్యవేత్తల్లో చాలా మంది గుర్తు తెలియని కారణాలతో అస్వస్థులయ్యారు. 



Updated Date - 2020-12-06T23:09:36+05:30 IST