‘నాజల్ స్వాబ్’ సురక్షితమేనా?
ABN , First Publish Date - 2020-10-03T08:15:03+05:30 IST
స్వాబ్ తీసుకునే వారి నిర్లక్ష్యం కారణంగా ఆ మహిళ ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని డాక్టర్లు తెలిపారు...

అమెరికాలో ఓ మహిళకు దెబ్బతిన్న మెదడు పొర
న్యూఢిల్లీ, అక్టోబరు 2: ఆమె అమెరికాకు చెందిన 40 ఏళ్ల మహిళ. ఆమెకు త్వరలో హెర్నియా సర్జరీ. డాక్టర్లను సంప్రదిస్తే.. ముందుగా కరోనా పరీక్షలు చేయించుకుని రమ్మన్నారు. దీంతో.. దగ్గర్లోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అక్కడి సిబ్బంది ఆమె ముక్కు అంతఃకుహరాల నుంచి స్వాబ్(నాజల్ స్వాబ్) తీసుకున్నారు. ఆ తర్వాత కొంతసేపటికి ఆమె తన నాసికా ద్వారం నుంచి ద్రవం లాంటి పదార్థం కారడం గమనించింది. వెంటనే డాక్టర్లను సంప్రదించగా.. వారు పరీక్షించి ఆమె మెదడు లైనింగ్(పలుచని పొర) దెబ్బతిందని గుర్తించారు. స్వాబ్ తీసుకునే వారి నిర్లక్ష్యం కారణంగా ఆ మహిళ ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా స్వాబ్ సేకరించే ఆరోగ్య కార్యకర్తలకు ఓ హెచ్చరిక లాంటిదని డాక్టర్లు చెబుతున్నారు. ఆరోగ్య కార్యకర్తలు.. పరీక్షల మార్గదర్శకాలను నిశితంగా పరిశీలించి, పాటించవలసిన అవసరాన్ని ఈ ఘటన తెలియజేస్తోందని జామా మెడికల్ జర్నల్ పేర్కొంది. సైనస్, పుర్రె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు నాజల్ స్వాబ్ టెస్టింగ్‌కు దూరంగా ఉండడం మంచిదని సూచించింది. బాధిత మహిళను పరీక్షించిన వైద్యుడు మాట్లాడుతూ.. ఆమె ఇంతకుముందు కూడా ఓ సారి నాసల్ స్వాబ్ పరీక్ష చేయించుకుందని, రెండోసారి మాత్రమే ఈ సమస్య వచ్చిందని, ఇది.. పరీక్షించిన వారి టెక్నిక్‌లో ఉన్న లోపాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు. దీని ప్రభావం వల్ల తీవ్రమైన తలనొప్పితో పాటు వాంతులు, మెడ నిలవకపోవడం, వెలుతురును భరించలేకపోవడం లాంటి సమస్యలను ఎదుర్కొన్నారని తెలిపారు.