ఆర్జేడీలోకి 17 మంది జేడీయూ ఎమ్మెల్యేలు..?

ABN , First Publish Date - 2020-12-30T22:19:42+05:30 IST

వాస్తవానికి ఎన్డీయే కూటమిలోని బీజేపీకే ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ ఎన్నికల ఒప్పందం ప్రకారం నితీష్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అయితే జేడీయూను అస్థిర పరిచేందుకు ప్రతిపక్ష, మిత్రపక్షాలు ప్రయత్నిస్తున్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఆర్జేడీలోకి 17 మంది జేడీయూ ఎమ్మెల్యేలు..?

పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యూనైటెడ్‌ (జేడీయూ) పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) పార్టీలో చేరనున్నట్లు జేడీయూ నేత శ్యామ్ రజక్ అన్నారు. జేడీయూకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు ఏ క్షణమైనా ఆర్జేడీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయితే తాము ఫిరాయింపుల చట్టం నిబంధనలను అతిక్రమించబోమని చెప్పిన ఆయన 28 మంది ఎమ్మెల్యేలతో కలిసి వస్తే మాత్రం పార్టీలోకి ఆహ్వానిస్తామని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.


‘‘17 మంది జేడీయూ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. వారు ఆర్జేడీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఏ క్షణమైనా జరగొచ్చు. ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చినప్పటి నుంచి ఆ చట్టం నిబంధనలను మేం అతిక్రమించడం లేదు. అయితే మేం వారికి ఒక విషయం స్పష్టం చేశాము. 28 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి వస్తే చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. త్వరలోనే ఈ సంఖ్య 28కి చేరే అవకాశం ఉంది’’ అని శ్యామ్ రజక్ అన్నారు.


కాగా, రజాక్ చేసిన వ్యాఖ్యలను నితీష్ కుమార్ కొట్టి పారేశారు. ఆర్జేడీ చేస్తున్న వాదనలు నిరాధారమని ఆయన అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ వేరే పార్టీలోకి వెళ్లే అవకాశం లేదని, ఆర్జేడీ తప్పుడుగా ప్రచారం చేస్తోందని నితీష్ అన్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో జేడీయూ ఆర్జేడీ, బీజేపీ కంటే అతి తక్కువ స్థానాలను గెలుచుకుంది. వాస్తవానికి ఎన్డీయే కూటమిలోని బీజేపీకే ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ ఎన్నికల ఒప్పందం ప్రకారం నితీష్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అయితే జేడీయూను అస్థిర పరిచేందుకు ప్రతిపక్ష, మిత్రపక్షాలు ప్రయత్నిస్తున్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Updated Date - 2020-12-30T22:19:42+05:30 IST