ఫైరింజన్లు పంపండి ప్లీజ్... ట్రోలింగ్‌పై ఇర్ఫాన్ పఠాన్ కౌంటర్!

ABN , First Publish Date - 2020-04-07T15:21:39+05:30 IST

ఆదివారం రాత్రి టపాసులు కాల్చడాన్ని ప్రశ్నించిన తనను ట్రోల్ చేయబోయిన నెటిజన్లను మాజీ...

ఫైరింజన్లు పంపండి ప్లీజ్... ట్రోలింగ్‌పై ఇర్ఫాన్ పఠాన్ కౌంటర్!

న్యూఢిల్లీ: తనను ట్రోల్ చేయబోయిన నెటిజన్లను మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రధాని పిలుపు మేరకు దీపాలు వెలిగించిన తర్వాత కొందరు అత్యుత్సాహంతో టపాసులు కాల్చినట్టు వచ్చిన వార్తలపై పఠాన్ ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘టపాసులు కాల్చక ముందు వరకు అంతా చాలా బాగుంది...’’ అని వ్యాఖ్యానించాడు. కరోనాపై దేశం యావత్తూ పోరాడుతున్న దశలో ఇలా టపాసులు కాల్చడం భావ్యం కాదనేలా అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే పఠాన్ విమర్శలపై కొందరు నెటిజన్లు తిట్లదండకం అందుకున్నారు. ఆల్‌రౌండర్‌ను మతానికి ముడిపెడుతూ... అనరాని మాటలతో విరుచుకుపడ్డారు. దీంతో కొన్ని స్క్రీన్ షాట్లను షేర్ చేసుకుంటూ పఠాన్ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘మాకు అగ్నిమాపక యంత్రాలు కావాలి... పంపించగలరా..’’ అని కౌంటర్ విసిరాడు. టీమిండియా క్రికెటర్‌గా ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించిన తన పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటంటూ భారత నెటిజన్లను ప్రశ్నించాడు. అయితే విమర్శకుల మాటలేవీ పట్టించుకోవద్దనీ.. మీరు అనేకమందికి స్ఫూర్తి ప్రదాతలు అంటూ నెటిజన్లు పఠాన్‌కు మద్దతుగా నిలిచారు.


కాగా కరోనా కల్లోలం నేపథ్యంలో పేదలకు సాయం చేసేందుకు ఇటీవల పఠాన్ సోదరులు యూసుఫ్, ఇర్ఫాన్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్‌ నుంచి రక్షించేందుకు నిరుపేద ప్రజలకు మాస్క్‌లు, ఆరోగ్య ఉత్పత్తులను పంచిన ఈ స్టార్ క్రికెటర్స్.. తాజాగా పదివేల కేజీల బియ్యం, 700 కేజీల బంగాళదుంపలను పంచిపెట్టి ఔదార్యం చాటుకున్నారు.



Updated Date - 2020-04-07T15:21:39+05:30 IST