టికెట్లు క్యాన్సిల్ చేసుకోవద్దు.. డబ్బు మొత్తం చెల్లిస్తాం: ఐఆర్‌సీటీసీ

ABN , First Publish Date - 2020-03-25T02:40:21+05:30 IST

రైళ్లు రద్దయిన కారణంగా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులెవరూ టికెట్లు క్యాన్సిల్ చేసుకోవద్దని ఐఆర్‌సీటీసీ కోరింది...

టికెట్లు క్యాన్సిల్ చేసుకోవద్దు.. డబ్బు మొత్తం చెల్లిస్తాం: ఐఆర్‌సీటీసీ

న్యూఢిల్లీ: రైళ్లు రద్దయిన కారణంగా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులెవరూ టికెట్లు క్యాన్సిల్ చేసుకోవద్దని ఐఆర్‌సీటీసీ కోరింది. ఆటోమేటిక్‌గా పూర్తి మొత్తం రీఫండ్ అవుతుందని హామీ ఇచ్చింది. కాగా రైల్వేశాఖ ఇటీవల టికెట్లు క్యాన్సిల్ చేసుకోవడానికి జూన్ 21 వరకు మూడు నెలల పాటు గడువు పెంచిన సంగతి తెలిసిందే. అయితే ప్యాసెంజర్ రైళ్లు నిలిపివేసిన కారణంగా ఈ-టికెట్ క్యాన్సిలేషన్‌‌పై పలు సందేహాలు వ్యక్తమయ్యాయని ఐఆర్‌సీటీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.


‘‘వినియోగదారులు  తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ వినియోగదారులు టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటే, వారికి తక్కువ డబ్బులు రీఫండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైల్వే శాఖ రద్దు చేసిన రైళ్లకు సంబంధించి ప్రయాణికులు తమంత తాము టికెట్లు క్యాన్సిల్ చేసుకోవద్దని కోరుతున్నాం...’’ అని ఐఆర్‌సీటీసీ కోరింది. వినియోగదారులు ఏ ఖాతా నుంచి ఈ-టికెట్లు బుక్ చేసుకుంటే తిరిగి అదే ఖాతాలోకి రీఫండ్ మొత్తం జమ అవుతుందని తెలిపింది. రైలు రద్దయిన పక్షంలో వినియోగదారుడి నుంచి రైల్వే శాఖ ఎలాంటి చార్జీ వసూలు చేయబోదని స్పష్టం చేసింది. కరోనా వైరస్ కారణంగా ఈ నెల 31 వరకు అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వేశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Read more