ట్రంప్‌తో జాగ్రత్త.. ఇరాన్ హెచ్చరిక
ABN , First Publish Date - 2020-11-21T19:47:28+05:30 IST
ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు అమెరికా-ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. రెండు దేశాల మధ్య మాటల యుద్దాలు...

ఇంటర్నెట్ డెస్క్: ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు అమెరికా-ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. రెండు దేశాల మధ్య మాటల యుద్దాలు జరిగాయి. ఒకరిపై మరొకరు ప్రత్యక్ష, పరోక్ష దాడులు చేసుకున్నారు. ఒకానొక సమయంలో ఇరాన్‌పై యుద్ధానికి కూడా ట్రంప్ రెడీ అయ్యారు. కానీ చివరి నిముషంలో వెనక్కి తగ్గారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడంచడంతో ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. బైడెన్ భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో ఇరాన్ ఊపిరి పీల్చుకుంటోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలుపును స్వాగతించిన ఇరాన్.. ట్రంప్ కాలంలో రద్దు చేసిన అణు ఒప్పందాన్ని బైడెన్ ప్రభుత్వంతో పునరుద్ధరించాలని చూస్తోంది.
అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని ట్రంప్.. పదవి దిగే లోపు కొన్నైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నారని ఇరాన్‌కు సమాచారమందిందట. ఇందులో భాగంగానే ఇరాన్‌పై దాడి చేయడానికి ఉన్న మార్గాలను కూడా అధికారుల ద్వారా ఆరా తీశారని, అయితే దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయని అధికార వర్గం చెప్పడంతో ట్రంప్ మళ్లీ వెనక్కి తగ్గారని ఇరాన్ చెబుతోంది.

ఇదిలా ఉంటే ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉన్న అణు ఒప్పందాన్ని ట్రంప్ రద్దు చేశారు. దానికితోడు కఠినమైన వాణిజ్య ఆంక్షలు కూడా విధించారు. ఈ ఏడాది ఆరంభంలో ఇరాన్ అత్యున్నత స్థాయి కమాండర్ జనరల్ ఖాసీం సులేమానీపై దాడి చేసి హతమార్చారు. అమెరికా చర్యకు ఇరాన్ కూడా దీటుగా బదులచ్చింది. ఇరాక్‌లో యూఎస్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి జరిపింది. దీంతో 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.

ఎన్నికల్లో ఓడిపోయినా అధికార బదిలీ నేపథ్యంలో ట్రంప్ మరికొన్ని రోజుల పాటు అధ్యక్ష పదవిలోనే కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో ముప్పు ఇంకా పొంచి ఉందని ఇరాన్ భావిస్తోంది. ట్రంప్ ఎలాంటి అఘాయిత్యానికైనా వెనుకాడడంటూ సంచలన ప్రకటన చేసింది. తమ మిత్ర దేశాలను సైతం హెచ్చరించింది. ట్రంప్‌తో జాగ్రత్తగా ఉండాలని, ఈ సమయంలో అమెరికాతో ఎలాంటి ఉద్రిక్తతలు పెంచుకోవద్దని, అలా చేస్తే ట్రంప్ మరింత రెచ్చిపోయే ప్రమాదముందని, అతడు ఏం చేసినా ఆశ్చర్యం లేదని హెచ్చరించింది.

ట్రంప్ వైఖరిపై ఇరాన్ రక్షణ మంత్రి హొస్సేన్ డెఘాన్ మాట్లాడుతూ.. తాము యుద్ధాన్ని కోరుకోవట్లేదని, కానీ అనవసరంగా కయ్యానికి కాలు దువ్వితే దీటైన జవాబిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా మిత్రపక్షాలకూ ఈ విషయంపై ప్రత్యేక సందేశాలు పంపించినట్లు సమాచారం. ‘వచ్చే 2నెలలు చాలా కీలకం. ఈ కాలంలో ట్రంప్ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. అందువల్ల అమెరికాతో ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా వెనక్కి తగ్గి ఉండండి’ అంటూ ఇరాన్ జనరల్ స్థాయి అధికారులు తమ దేశ మిత్రపక్షాలకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
