మంత్రులు, ఐపీఎస్‌లకు కొవాగ్జిన్‌

ABN , First Publish Date - 2020-12-28T07:38:55+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అభివృద్ధిచేసిన ‘కొవాగ్జిన్‌’తో నిర్వహిస్తున్న మూడోదశ ప్రయోగ పరీక్షల్లో పలువురు ప్రముఖులు కూడా వలంటీర్లుగా చేరుతున్నారు...

మంత్రులు, ఐపీఎస్‌లకు కొవాగ్జిన్‌

  • కర్ణాటకలో వలంటీర్లుగా వీఐపీలు


అహ్మదాబాద్‌, డిసెంబరు 27 : హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అభివృద్ధిచేసిన ‘కొవాగ్జిన్‌’తో నిర్వహిస్తున్న మూడోదశ ప్రయోగ పరీక్షల్లో పలువురు ప్రముఖులు కూడా వలంటీర్లుగా చేరుతున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని వైదేహి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (వీఐఎంఎ్‌సఆర్‌సీ)లో జరుగుతున్న ట్రయల్స్‌లో ఇప్పటివరకు 100 మందికిపైగా ప్రముఖులు ప్రయోగాత్మక టీకా వేయించుకున్నారు. వీరిలో 14 మంది కర్ణాటక రాష్ట్ర మంత్రులు, పలువురు ఐపీఎస్‌ అధికారులు ఉన్నారు.  ట్రయ ల్స్‌ను పర్యవేక్షించే సంస్థ ఈ వివరాలను ధ్రువీకరించింది.


మధ్యప్రదేశ్‌లో కలకలం

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కరోనా పరీక్షలు నిర్వహించగా.. మధ్యప్రదేశ్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలు, 61 మంది సచివాలయ సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరోవైపు దేశంలో శనివారం 18,732 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులు 19వేల దిగువన నమోదవడం జూన్‌ 30వ తేదీ తర్వాత ఇదే తొలిసారి. యూకే నుంచి తిరిగొచ్చినవారిలో పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీలో కొత్తగా ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది. హస్తినలో ఇప్పటివరకు 21మందియూకే రిటర్న్స్‌కు పాజిటివ్‌గా తేలింది. మహారాష్ట్రలో ఈ సంఖ్య 16కు పెరిగింది.  


ఆక్స్‌ఫర్డ్‌ టీకా కొత్త స్ట్రెయిన్‌పైనా.. 

ఫైజర్‌, మోడెర్నా కంపెనీల కరోనా వ్యాక్సిన్లతో సమానంగా.. 95 శాతం ప్రభావశీలతను చూపే సామర్థ్యాన్ని తమ వ్యాక్సిన్‌ సంతరించుకుందని ఆస్ట్రాజెనెకా కంపెనీ సీఈఓ పాస్కల్‌ సోరియట్‌ ప్రకటించారు. కరోనా కొత్త స్ట్రెయిన్‌పైనా తమ వ్యాక్సిన్‌ పనిచేస్తుందన్నారు.  ఇక కరోనా కొత్త స్ట్రెయిన్‌పై ఆందోళన అక్కర్లేదని, ఈ వైర్‌సలో ప్రతినెలా సగటున రెండు కొత్త జన్యుమార్పులు జరుగుతున్నాయని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా వెల్లడించారు. 

Updated Date - 2020-12-28T07:38:55+05:30 IST