భారత ‘డేటా నియంత్రణ’
ABN , First Publish Date - 2020-08-11T08:06:35+05:30 IST
భారత్ ప్రతిపాదిస్తున్న ‘డేటా నియంత్రణ’ను అమెరికాకు చెందిన బహుళ జాతి సంస్థలు, టెక్ దిగ్గజాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ‘వ్యక్తిగతేతర డేటా’ను అన్ని సంస్థలు ఓపెన్సోర్స్గా వాడుకోవాలని...

- నిర్ణయంపై అమెరికా కంపెనీల నిరసన
వాషింగ్టన్, ఆగస్టు 10: భారత్ ప్రతిపాదిస్తున్న ‘డేటా నియంత్రణ’ను అమెరికాకు చెందిన బహుళ జాతి సంస్థలు, టెక్ దిగ్గజాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ‘వ్యక్తిగతేతర డేటా’ను అన్ని సంస్థలు ఓపెన్సోర్స్గా వాడుకోవాలని, ఇతర సంస్థలకు అందజేయాలనేది భారత ‘డేటా నియంత్రణ’ ముసాయిదా లక్ష్యం. దీనిపై కేంద్ర ప్రభుత్వం నియమించిన 9 మంది సభ్యుల కమిటీ జూలైలో నివేదిక సమర్పించింది. ఈ కమిటీకి ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు క్రిష్ గోపాలకృష్ణన్ నేతృత్వం వహించారు. కమిటీ నివేదిక మేరకు.. వ్యక్తిగతేతర (నాన్-పర్సనల్) వివరాలను టెక్ దిగ్గజాలు, బహుళజాతి సంస్థలు అందరికీ అందుబాటులో పెట్టాలి. అంటే.. అమెజాన్ లాంటి సంస్థలు కూడా ఆ డేటాను పోటీసంస్థలకు అందజేయాలి. ఈ నెల 13న కేంద్రం దీనిపై ఓ ముసాయిదాను పబ్లిక్డొమైన్లో పెట్టనుంది. ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించనుంది. ఆ తర్వాత ‘డేటా నియంత్రణ’ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఆ బిల్లు పాసయ్యాక.. డేటా నియంత్రణకు ప్రత్యేక సాధికార సంస్థను నియమిస్తారు. ఈ కమిటీ వ్యక్తిగతేతర డేటాను మూడు కేటగిరీలుగా విభజించింది. అవి.. పబ్లిక్ నాన్-పర్సనల్ డేటా, ప్రైవేట్ నాన్-పర్సనల్ డేటా, కమ్యూనిటీ నాన్-పర్సనల్ డేటా. ఈ నిర్ణయంపై యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ (యూఎ్ససీసీ) అనుబంధ సంస్థ అమెరికా-భారత వ్యాపార మండలి (యూఎ్సఐబీసీ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.