దీపాలు వెలిగించడం కాదు, ఉద్యోగాలు ఇవ్వండి : ఛత్తీస్‌గఢ్ మంత్రి

ABN , First Publish Date - 2020-04-06T03:33:09+05:30 IST

దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనం అమలవుతున్న నేపథ్యంలో ఉపాధి కోల్పోయి, ఇళ్ళలో ఉంటున్నవారికి ఉద్యోగాలు

దీపాలు వెలిగించడం కాదు, ఉద్యోగాలు ఇవ్వండి : ఛత్తీస్‌గఢ్ మంత్రి

రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) : దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనం అమలవుతున్న నేపథ్యంలో ఉపాధి కోల్పోయి, ఇళ్ళలో ఉంటున్నవారికి ఉద్యోగాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ దేవ్ కోరారు. దీపాలు వెలిగించడానికి బదులు  ఆదాయం లేకుండా ఇళ్ళలో ఉన్నవారికి ఏదో ఒక ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. 


ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 9 నిమిషాల వరకు దేశవ్యాప్తంగా ఇళ్లలో దీపాలు వెలిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని, ఇలాంటివి జాతీయ స్థాయిలో జరగకూడదని సింగ్ దేవ్ అన్నారు. దీనివల్ల ఉపయోగం ఉండదన్నారు. దీనికి బదులుగా ఇళ్ళలో ఉన్నవారికి ఏదో ఒక ఉద్యోగం ఇచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఇలాంటి పనులు చేస్తూ 21వ శతాబ్దంలో మూఢ నమ్మకాల వైపు వెళ్తున్నామా? అని ప్రశ్నించారు.


ఛత్తీస్‌గఢ్‌లో పది మంది కరోనా వైరస్ బాధితుల్లో ఏడుగురు కోలుకున్నారని తెలిపారు. వీరిని ఆసుపత్రి నుంచి ఇంటికి త్వరలో పంపిస్తారని చెప్పారు. దీనినిబట్టి కరోనా వైరస్ పట్ల తాము వ్యవహరిస్తున్న తీరు సంతృప్తికరంగా ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. 


Updated Date - 2020-04-06T03:33:09+05:30 IST