వైద్య బృందాలతో పొరుగు దేశాలకు బయల్దేరిన ఐఎన్ఎస్ కేసరి నౌక

ABN , First Publish Date - 2020-05-10T22:14:40+05:30 IST

దక్షిణ హిందూ మహా సముద్ర ప్రాంత దేశాలకు భారత దేశం వైద్య సహాయం

వైద్య బృందాలతో పొరుగు దేశాలకు బయల్దేరిన ఐఎన్ఎస్ కేసరి నౌక

న్యూఢిల్లీ : దక్షిణ హిందూ మహా సముద్ర ప్రాంత దేశాలకు భారత దేశం వైద్య సహాయం అందిస్తోంది. ‘మిషన్ సాగర్’ పథకంలో భాగంగా వైద్య సహాయ బృందాలు, మందులు, నిత్యావసర ఆహార పదార్థాలను ఐఎన్ఎస్ కేసరి నౌకలో పంపించింది. 


కోవిడ్-19 మహమ్మారితో పోరాడేందుకు సహాయం అందజేయాలని భారత దేశాన్ని మాల్దీవులు, మారిషస్, మడగాస్కర్, కొమోరోస్, సీషెల్స్ దేశాలు కోరాయి. 


భారత దేశం పంపించిన మెడికల్ అసిస్టెన్స్ టీమ్స్‌ మారిషస్, కొమొరోస్‌లలో సేవలందిస్తాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కోవిడ్ ఎమర్జెన్సీ, డెంగ్యూ ఫీవర్ చికిత్సలో సహాయపడనున్నట్లు తెలిపింది. 


కోవిడ్ సంబంధిత అత్యవసర మందులను మారిషస్, మడగాస్కర్, కొమొరోస్, సీషెల్స్ దేశాలకు ఈ నౌక తీసుకెళ్తోంది. మాల్దీవులకు 600 టన్నుల ఆహార పదార్థాలను అందజేస్తుంది. మారిషస్‌కు ఆయుర్వేద మందులను కూడా పంపిస్తున్నట్లు తెలిపింది. 


మడగాస్కర్, కొమొరోస్‌ దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను కూడా పంపిస్తున్నట్లు తెలిపింది. వీటిని మారిషస్‌కు గతంలోనే పంపించినట్లు వివరించింది. 


Updated Date - 2020-05-10T22:14:40+05:30 IST