కాంగ్రెస్ భూమిపూజలు చేస్తే... మేము పూర్తి చేస్తున్నాం : అమిత్‌షా
ABN , First Publish Date - 2020-12-27T21:17:41+05:30 IST
ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ చాలా సంవత్సరాల పాటు పాలించిందని, అయినా కాంగ్రెస్ చేసిందేమీ లేదని

అసోం : ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ చాలా సంవత్సరాల పాటు పాలించిందని, అయినా కాంగ్రెస్ చేసిందేమీ లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శించారు. అతివాదులతో ఏనాడు చర్చలు జరపలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ భూమి పూజలు చేసి ఆగిపోయేదని, కానీ తాము వచ్చిన తర్వాత అభివృద్ధి పనులను తాము పూర్తిచేస్తున్నామని వివరించారు. కేంద్ర హోంమంత్రి మణిపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇక మణిపూర్‌కు అన్నీ మంచి రోజులేనని హర్షం వ్యక్తం చేశారు. ఒకప్పుడు తిరుగుబాటుకు కేంద్రంగా ఉండే ప్రాంతం, నేడు అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని పేర్కొన్నారు. ‘‘గతంలో తిరుగుబాటుకు కేంద్రంగా ఉండేది మణిపూర్. బంద్‌లు, నిర్బంధాలు ఉండేవి. కానీ... ఇప్పుడు చాలా మిలిటెంట్ సంఘాలు జనజీవన స్రవంతిలో కలిసిపోయాయి. ‘‘ఇన్నర్ లైన్’’ ను అనుమతించి మణిపూర్ ప్రజలకు మోదీ ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిందని పేర్కొన్నారు. ‘‘ఇన్నర్ లైన్’’ అనేది చాలా కాలం పాటు మణిపూర్ ప్రజల డిమాండ్‌గా ఉండేదని, దానిని మోదీ ప్రభుత్వం చేసి చూపించిందని అన్నారు.