ఐసొలేషన్‌లో ఇన్ఫెక్షన్లకు చెక్
ABN , First Publish Date - 2020-04-07T08:12:02+05:30 IST
కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడేందుకు పంజాబ్‌లోని ఐఐటీ రోపార్ శాస్త్రవేత్తలు నెగెటివ్ ప్రెషర్ రూమ్ డిజైన్‌ను...

- నెగెటివ్ ప్రెషర్ రూమ్‌కు ఐఐటీ రోపార్ శాస్త్రవేత్తల డిజైన్
చండీగఢ్/కోల్‌కతా/న్యూఢిల్లీ,ఏప్రిల్ 6: కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడేందుకు పంజాబ్‌లోని ఐఐటీ రోపార్ శాస్త్రవేత్తలు నెగెటివ్ ప్రెషర్ రూమ్ డిజైన్‌ను అభివృద్ధిచేశారు. ఈ ఘనతను సాధించిన ప్రొఫెసర్ ధీరజ్ కె.మహాజన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అభినందించారు. . ఐసోలేషన్ గదుల్లో చికిత్స పొందుతున్న రోగులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నీటితుంపరల ద్వారా ఆరోగ్య సిబ్బందికి వైరస్ సోకే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య సిబ్బందిని కాపాడేందుకు నెగెటివ్ ప్రెషర్ రూమ్ మోడల్ ఉపయోగపడుతుంది. ఇందులో రోగి ఐసోలేషన్ గదికి అనుసంధానంగా ఒక నెగెటివ్ ప్రెషర్ రూమ్‌ను నిర్మిస్తారు.
వెంటిలేషన్ వ్యవస్థ ద్వారా ఐసోలేషన్ గదిలో అత్యధిక పీడనం ఏర్పడుతుంది. రోగి తుమ్ములు, దగ్గుల నుంచి వెలువడే వైర్‌సలు గాలిలో వ్యతిరేక దిశలో ప్రయాణించి.. పక్కనే అనుసంధానమై ఉండే నెగెటివ్ ప్రెషర్‌రూమ్‌లోకి చేరుతుంది. ఫలితంగా ఐసోలేషన్ గదిలో వైర్‌సలు కదలాడే అవకాశమే ఉండదు. అందుబాటులో ఉన్న వస్త్రాలతోనే తయారుచేసుకోగల అతిచౌక మాస్క్ నమూనాను పశ్చిమబెంగాల్‌లోని జాధవ్‌పూర్ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. కేవలం గంటలోనే కరోనా ఉందో.. లేదో తేల్చేసే నిర్ధారణ పరీక్షల కిట్‌ను గోవా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే మోల్‌బయో డయాగ్నస్టిక్స్ కంపెనీ అభివృద్ధిచేసింది. ప్రతీ పరీక్షకు రూ.1,350 చెల్లించాల్సి ఉంటుంది.