కరోనాపై పోరుకు కదిలొచ్చిన రైల్వే.. పీఎం సహాయనిధికి ఉద్యోగుల ఒక రోజు వేతనం

ABN , First Publish Date - 2020-03-28T01:51:37+05:30 IST

కరోనాపై పోరులో భాగంగా తమ ఉద్యోగులందరూ ఒక రోజు వేతనాన్ని ప్రధాన మంత్రి సహాయనిధికి

కరోనాపై పోరుకు కదిలొచ్చిన రైల్వే.. పీఎం సహాయనిధికి ఉద్యోగుల ఒక రోజు వేతనం

న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భాగంగా తమ ఉద్యోగులందరూ ఒక రోజు వేతనాన్ని ప్రధాన మంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వాలని భారతీయ రైల్వే కోరింది. రైల్వేలో మొత్తం 13.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. కరోనా మహమ్మారి కారణంగా దేశానికి ముప్పు పొంచి ఉందని, కాబట్టి దీనిని జాతీయ విపత్తుగా ప్రభుత్వం ప్రకటించిందని జనరల్ మేనేజర్లకు రాసిన లేఖలో పేర్కొంది. ఇది విపత్తు నిర్వహణ చట్టంలోని చట్టబద్ధమైన నిబంధనలను అమలు చేయడానికి దారితీస్తుందని ఆ లేఖలో తెలిపింది. ఈ నేపథ్యంలో సాయం కోసం సాధ్యమయ్యే అన్ని అవకాశాలను బోర్డు పరిశీలించినట్టు పేర్కొంది. ఇలాంటి విపత్కర సమయాల్లో సాయం అందించేందుకు రైల్వే ఎల్లప్పుడూ ముందే ఉంటుందని వివరించింది. గతంలోనూ ఇలాంటి సంక్షోభ సమయంలో రైల్వే సిబ్బంది అండగా నిలిచారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల మూలవేతనంలో ఓ రోజు వేతనాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించినట్టు వివరించింది. కాగా, కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రైల్వే ఇప్పటికే తమ ప్రొడక్షన్ యూనిట్లలో శానిటైజర్లు, మెడికల్ కాట్స్, ఐవీ స్టాండ్లు, మాస్కుల ఉత్పత్తిని ప్రారంభించింది.

Updated Date - 2020-03-28T01:51:37+05:30 IST