న్యూజీలాండ్‌లో ఎంపీగా గెలిచిన భారతసంతతి వైద్యుడు

ABN , First Publish Date - 2020-11-25T20:49:52+05:30 IST

న్యూజీలాండ్‌లో ఎంపీగా గెలిచిన భారతసంతతి వైద్యుడు

న్యూజీలాండ్‌లో ఎంపీగా గెలిచిన భారతసంతతి వైద్యుడు

వెల్లింగ్‌టన్: న్యూజీలాండ్ పార్లమెంట్‌కు భారతసంతతి వైద్యుడు ఎన్నికయ్యారు. లేబర్ పార్టీ నుంచి హామిల్టన్ వెస్ట్‌ ఎంపీగా ఎన్నికైన ఆయన సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారు. డాక్టర్ గౌరవ్ శర్మ అనే వ్యక్తి న్యూజీలాండ్‌లో వైద్యుడిగా పని చేస్తున్నారు. ఆయన అక్కడే స్థిరపడ్డ భారతీయుడు. స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హమిర్‌పూర్ జిల్లా.


కాగా, ఆయన ప్రమాణ స్వీకారంపై సోషల్ మీడియాలో చిన్నపాటి చర్చ జరిగింది. శర్మ సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు ఓ నెటిజెన్. దీనికి ఆయన గట్టి సమాధానమే ఇచ్చారు. ‘‘లేబర్ పార్టీ నుంచి గెలిచిన శర్మ.. భారతదేశంలో నిమ్న కులాలను అణచివేసిన సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేయడమేంటి? సంస్కృతం హిందుత్వకు సూచిక. అంతే కాకుండా పెట్టుబడిదారి విధానానికి సూచిక. లేబర్ పార్టీ పాటించే విలువలు ఇవేనా?’’ అని ఓ నెటిజెన్ ప్రశ్నించారు.


దీనికి శర్మ సమాధానం ఇస్తూ ‘‘భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి. అందులో సంస్కృతం ఒకటి. సంస్కృతం అనేది భారత్‌లో పురాతన భాష. ఈ భాష నుంచి ఇండియాలోని చాలా భాషలు పుట్టుకొచ్చాయి. నేను ఒకే భాషలో ప్రమాణ స్వీకారం చేయలేదు. రెండు భాషల్లో ప్రమాణ స్వీకారం చేశాను. అందులో సంస్కృతం ఒకటి. నా మాతృభాష పహారి. అయితే ఏ భాషలో ప్రమాణ స్వీకారం చేసిన స్థానికతను సూచిస్తుంది. అదే సంస్కృతంలో అయితే భారత్ మొత్తానికి వర్తిస్తుందని ఆ భాషలో ప్రమాణ స్వీకారం చేశాను’’ అని అన్నారు.

Read more