స్పేస్ ఎక్స్ మిషన్‌లో.. భారత సంతతి ఆస్ట్రోనాట్!

ABN , First Publish Date - 2020-12-15T23:58:42+05:30 IST

ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు ఎలన్ మస్క్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన స్పేస్ ట్రావెల్స్‌లో మరో అంకం మొదలైంది. ఇటీవల స్పేస్ ఎక్స్ చేపట్టిన అంతరిక్ష ప్రయోగాలు సత్ఫలితాలు ఇవ్వడంతో ఈ సంస్థ జోరు పెంచింది

స్పేస్ ఎక్స్ మిషన్‌లో.. భారత సంతతి ఆస్ట్రోనాట్!


ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు ఎలన్ మస్క్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన స్పేస్ ట్రావెల్స్‌లో మరో అంకం మొదలైంది. ఇటీవల స్పేస్ ఎక్స్ చేపట్టిన అంతరిక్ష ప్రయోగాలు సత్ఫలితాలు ఇవ్వడంతో ఈ సంస్థ జోరు పెంచింది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది మరోసారి మానవ సహిత రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాతో కలిసి పనిచేస్తోంది. నాసాకు చెందిన కమర్షియల్ క్రూ మిషన్స్‌లో భాగంగా.. స్పేస్‌ఎక్స్ క్రూ-3 ప్రాజెక్టుకు రంగం సిద్ధం అయింది.


క్రూ-3 ప్రాజెక్టులో భాగంగా ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నారు. వీరి ముగ్గురూ ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్‌కు చేర్చడమే స్పేస్ ఎక్స్ రాకెట్ల లక్ష్యం. ఈ ముగ్గురు వ్యోమగాముల్లో భారత సంతతి వ్యక్తి కూడా ఉన్నారు. 2017లో నాసాలో చేరిన ఆయనకు ఇదే తొలి అంతరిక్ష ప్రయాణం. ఆయన పేరే రాజా చారి. మిల్వాకీలో పుట్టిన రాజా చారి.. లోవాలోని సెడార్ ఫాల్స్‌నే తన స్వగ్రామంగా భావిస్తారట. యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లో కల్నల్‌గా సేవలందించిన చారి.. తన కెరీర్‌లో 2,500 గంటల ఫ్లయిట్ ఎక్స్‌పీరియన్స్‌ను మూటగట్టుకున్నాడు. అమెరికా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆర్టెమిస్ రాకెట్ ప్రయోగం కోసం ఎంపిక చేసిన వ్యోమగాముల్లో చారి కూడా ఒకరు కావడం విశేషం.


చారితోపాటు మార్ష్‌బర్న్ అనే మెడికల్ డాక్టర్, అలాగే మారర్ అనే మరో ఆస్ట్రోనాట్.. స్పేస్‌ఎక్స్ మిషన్‌లో పాలుపంచుకుంటారు. వీరిలో మార్ష్‌బర్న్ ఇప్పటికే పలుసార్లు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు వెళ్లి వచ్చారు. మారర్‌ మాత్రం అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ విషయంలో చారి, మారర్‌ అనుభవం ఒకటే. స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హ్యూమన్ స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టంలో ఇది మూడో మిషన్. అలాగే డెమో-2 అంతరిక్ష ప్రయోగం కూడా కలుపుకుంటే స్పేస్ ఎక్స్ సంస్థ.. అంతరిక్షంలోకి ఆస్ట్రోనాట్స్‌ను పంపడం ఇది నాలుగోసారి. తక్కవు ఖర్చుతో సేఫ్‌గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వ్యోమగాములను చేర్చడమే ఈ మిషన్ ప్రధాన ఉద్దేశ్యమని తెలుస్తోంది.

Updated Date - 2020-12-15T23:58:42+05:30 IST