క్యూ2లో అంచనాలకు మించి పుంజుకున్న భారత ఆర్థిక వ్యవస్థ..!

ABN , First Publish Date - 2020-11-28T00:57:16+05:30 IST

సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా కోలుకుంది. తయారీ రంగం పుంజుకోవడంతో...

క్యూ2లో అంచనాలకు మించి పుంజుకున్న భారత ఆర్థిక వ్యవస్థ..!

న్యూఢిల్లీ: జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా కోలుకుంది. తయారీ రంగం పుంజుకోవడంతో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) క్షీణత ఈసారి 7.5 శాతానికి పరిమితమైనట్టు కేంద్రం తాజా గణాంకాలను వెల్లడించింది. దీంతో ముందు ముందు వినియోగ డిమాండ్ మరింత ఊపందుకుంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ రికార్డు స్థాయిలో 23.9 శాతం మేర కుంచించుకుపోయిన విషయం తెలిసిందే. జూన్ నుంచి మళ్లీ కార్యకలాపాలు ప్రారంభం కావడంతో.. ఆర్థిక రంగం పుంజుకున్నట్టు ఇవాళ వెలువడిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇంతకు ముందు త్రైమాసికంలో 39 శాతం మేర కుదేలైన తయారీ రంగం.. జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో అనూహ్యంగా పుంజుకుని 0.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. వ్యవసాయ రంగం సైతం 3.4 శాతం మేర వృద్ధి కనబర్చగా.. వాణిజ్య, సేవల రంగం మాత్రం ఊహించిన దానికంటే తక్కువగా 15.5 శాతం క్షీణతను నమోదు చేసింది. ప్రజా వ్యయం కూడా 12 శాతం మేర తగ్గింది.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు మైనస్ 7.5 శాతంగా నమోదు కాగా... గతేడాది ఇదే త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 4.4 శాతంగా ఉంది. మరోవైపు ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో చైనా ఆర్థిక వృద్ధి 4.9 శాతంగా ఉంది. గత త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) ఇది 3.2 శాతంగా ఉంది. కాగా తాజా త్రైమాసిక ఫలితాల్లో వరుసగా రెండోసారి నమోదైన ఆర్ధిక క్షీణత దేశాన్ని సాంకేతికంగా సంక్షోభంలోకి నెట్టినప్పటికీ... అత్యంత వేగంగా పుంజుకోవడంతో ఆర్థిక సంవత్సరం చివరినాటికల్లా మళ్లీ గాడిన పడుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. కాగా దేశ ఆర్థిక రంగం లాక్‌డౌన్‌ నుంచి అనుకున్న దానికంటే వేగంగా పుంజుకుందనీ... నాలుగో త్రైమాసికానికల్లా వృద్ధి రేటు నమోదవుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నిన్న పేర్కొన్న విషయం తెలిసిందే. 

Updated Date - 2020-11-28T00:57:16+05:30 IST