అమెరికా నుంచి భారతీయులను తీసుకురావడం కుదరదు: సుప్రీం
ABN , First Publish Date - 2020-04-22T01:20:52+05:30 IST
కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా అమెరికా నుంచి భారతీయులను వెనక్కి తీసుకురావడం సాధ్యపడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది...

న్యూఢిల్లీ: కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా అమెరికా నుంచి భారతీయులను వెనక్కి తీసుకురావడం సాధ్యపడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మనం ఎంత కావాలనుకున్నా ప్రస్తుతం అది జరిగే పనికాదని తేల్చిచెప్పింది. అమెరికాలో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకురావాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ‘‘వారికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సాయం అందుతోంది. వారంతా ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. కాబట్టి వెనక్కి తీసుకురావడం సాధ్యమయ్యే పనికాదు. అమెరికా ప్రభుత్వం వీసాలను పొడిగిస్తోంది. కొద్ది రోజులు వేచిచూద్దాం..’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అయితే వీసా పొడిగింపు దరఖాస్తులకు దాదాపు 500 డాలర్లు ఖర్చు అవుతుందనీ.. దీనివల్ల వీసాలు పొడిగిస్తారన్న గ్యారంటీ లేదని ఈ సందర్భంగా పిటిషనర్, న్యాయవాది విభా దత్తా మఖిజా విన్నవించారు. అయితే విదేశీ ప్రభుత్వాన్ని తాము నియంత్రించలేమనీ.. వీసా పొడిగింపులో సమస్యలు ఎదురుకాకుండా భారత ప్రభుత్వం అమెరికాను అభ్యర్ధించ వచ్చునని ధర్మాసనం పేర్కొంది.