భారత్ ఆత్మాభిమానంపై ఎవరు దెబ్బకొట్టినా ఊరుకోం : రాజ్‌నాథ్ సింగ్

ABN , First Publish Date - 2020-12-30T14:36:29+05:30 IST

భారత్ అన్ని దేశాలతో సత్సంబంధాలనే కొనసాగించాలని భావిస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు.

భారత్ ఆత్మాభిమానంపై ఎవరు దెబ్బకొట్టినా ఊరుకోం : రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ : భారత్ అన్ని దేశాలతో సత్సంబంధాలనే కొనసాగించాలని భావిస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఎవరైతే భారత్‌ను రెచ్చగొట్టాలని చూస్తారో, వారిని మాత్రం విడిచిపెట్టమని, తగిన బుద్ధి చెప్పి తీరుతామని హెచ్చరించారు. ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. భారత్ ఆత్మాభిమానంపై ఎవరు దెబ్బ కొట్టినా ఏమాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వ్యవహార శైలిలో మృదుత్వాన్ని అవలంబిస్తే.. ఇతరులు రెచ్చిపోండన్న అర్థం కాదని, అలా రెచ్చిపోతే చేతులు ముడుచుకొని కూర్చోమని పరోక్షంగా చైనాను హెచ్చరించారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను కల్పించే విషయంలో తమ ప్రభుత్వం త్వరితగతంగా ముందుకు వెళ్తోందని, ఈ మౌలిక సదుపాయాల కల్పనతో ఏ దేశాన్ని భయభ్రాంతులకు గురి చేయడానికి కాదని, కేవలం ప్రజల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు.


చైనా కూడా సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాను కల్పించడంలో విశేషంగా శ్రమిస్తోందని, భారత్ కూడా సరిహద్దుల్లోని సైనికుల కోసం, అక్కడ నివసించే ప్రజల కోసం మౌలిక సదుపాయాల కల్పనలో ముందుకెళ్తున్నామని తెలిపారు. పాక్ ఆవిర్భావం నుంచీ సరిహద్దు వెంబడి చేయరాని చేష్టలను చేస్తోందని తీవ్రంగా దుయ్యబట్టారు. సైనికలు సరిహద్దుల్లో పోరాడటంతో పాటు, నేరుగా శత్రువుల భూభాగాల్లోకి వెళ్లి రహస్య స్థావరాలపై విరుచుకుపడుతున్నారని పేర్కొన్నారు. ఇంతలా విరుచుకుపడే సత్తా భారత సైన్యానికి ఉందని ఆయన ప్రకటించారు. భారత అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశ ప్రధానీ జోక్యం చేసుకున్నా తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని, భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఏ దేశానికీ లేదని రాజ్‌నాథ్ హెచ్చరించారు.


రైతులు ఉగ్రవాదులు, నక్సలైట్లు అని మేం అనలేదు...

 కొందరు రైతుల్లో లేనిపోని అపోహలను పెంచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చట్టంలోని ప్రతి అంశంపై చర్చించడానికి రైతులు ముందుకు రావాలని, అవును ,కాదు అన్న రెండు పదాలు చెప్పడమన్నది సరికాదని సూచించారు. ఇలా అంశాల వారీగా చర్చిస్తేనే ఓ పరిష్కారం దొరకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలోని పెద్దలెవరూ రైతులను తీవ్రవాదులు, నక్సలైట్లు అని అనలేదని, రైతులంటే తమకు అపారమైన ప్రేమ ఉందని స్పష్టం చేశారు. ఎందుకంటే రైతులు దేశానికి అన్నం పెట్టే ‘అన్నదాతలు’ అని వివరించారు. కనీస మద్దతు ధర కొనసాగుతుందని తాము పదే పదే ప్రకటిస్తూనే ఉన్నామని, ప్రకటించిన హామీని నిలబెట్టుకోకపోతే... ప్రజాస్వామ్య వ్యవస్థలో నేతల్ని క్షమించరని పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న తలంపుతోనే ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. భారత దేశ సంస్కృతిని సిక్కు ప్రజలు ఎప్పుడూ సంరక్షిస్తూనే ఉంటారని, దేశ స్వాభిమానం విషయంలో సిక్కుల సేవ నిరుపమానమని రాజ్‌నాథ్ కొనియాడారు. 

జమ్మూలో ప్రజాస్వామ్యం విజయం సాధించింది

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం, వేర్పాటువాదం ఓడిపోయిందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. అక్కడ ప్రజాస్వామ్యం జెండా విజయబావుటా ఎగురవేసిందని పేర్కొన్నారు. 

బలవంతపు మత మార్పిడిపై...

చాలా కేసుల్లో బలవంతంగా మత మార్పిడులు జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. సహజంగా పెళ్లి చేసుకోవడానికి, బలవంతంగా మతం మార్చి పెళ్లి చేసుకోవడానికి హస్తిమశకం తేడా ఉందని స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాలు వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొన్నాయని స్పష్టం చేశారు. అసలు బలవంతపు మార్పిడులు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. బలవంతపు సామూహిక మత మార్పిళ్లు ఆగాలని స్పష్టం చేశారు. ‘‘నాకు తెలిసినంత వరకు ఇతర మతాలకు చెందిన వారితో పెళ్లిళ్లు చేసుకోవడానికి ఆమోద ముద్ర ఉండదు. బలవంతపు మత మార్పిళ్లు చేసి పెళ్లి చేసుకోడానికి వ్యక్తిగతంగా నేను వ్యతిరేకం.’’ అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

Updated Date - 2020-12-30T14:36:29+05:30 IST