కరోనా ఎఫెక్ట్: ల్యాండింగ్‌కు భారత్ నో.. వెనక్కు తిరిగిన విమానం

ABN , First Publish Date - 2020-03-21T19:10:35+05:30 IST

దాదాపు 90 మంది భారతీయులతో యూరప్‌ ఖండంలోని నెదర్లాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిందో విమానం.

కరోనా ఎఫెక్ట్: ల్యాండింగ్‌కు భారత్ నో.. వెనక్కు తిరిగిన విమానం

న్యూఢిల్లీ: దాదాపు 90 మంది భారతీయులతో యూరప్‌ ఖండంలోని నెదర్లాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిందో విమానం. దానిలోని భారతీయులంతా స్వదేశం చేరుకున్నందుకు సంతోషంగా ఉన్నారు. అంతలో వారి సంతోషంపై డీజీసీఏ(డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అధికారులు నీళ్లు కుమ్మరించారు. ఆ విమానం ల్యాండింగ్‌కు అనుమతివ్వడం కుదరదని తేల్చిచెప్పారు. దాంతో చేసేదేంలేక ఆ విమానం తిరుగుప్రయాణమైంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేఎల్‌ఎమ్ సంస్థకు చెందిన కేఎల్0871 విమానం ఆమ్‌స్టర్‌డ్యాం నుంచి ఢిల్లీకి వచ్చింది. అయితే విమానాలు బయలుదేరే ముందు తమ ప్రయాణ ప్రణాళికను సంబంధిత దేశాలతో పంచుకోవాలి. ఈ విమానం అలా చేయలేదు. అదే సమయంలో ఐరోపా నుంచి వచ్చే విమానాలపై భారత్‌లో ప్రస్తుతం నిషేధం అమల్లో ఉంది. ఇటలీ, స్పెయిన్ దేశాల్లో కరోనా కల్లోలం నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే శుక్రవారం ఢిల్లీ చేరుకున్న కేఎల్0871 విమానం ల్యాండింగ్‌కు అధికారులు అనుమతివ్వలేదు. చెప్పాపెట్టకుండా ఇలా ఢిల్లీకి విమానం నడపడం ద్వారా నెదర్లాండ్స్ నిబంధనలను ఉల్లంఘించిందని డీజీసీఏ అధికారులు ఆరోపించారు. ఇక చేసేదేం లేకపోవడంతో సదరు విమానం తిరిగి నెదర్లాండ్స్ బయలుదేరింది. ఈ విషయాన్ని డీజీసీఏ అధికారులు ధ్రువీకరించారు. అలాగే ఆదివారం నుంచి వారం రోజులపాటు విదేశీ విమానలను భారత్‌కు అనుమతించబోమని అధికారులు స్పష్టంచేశారు.

Updated Date - 2020-03-21T19:10:35+05:30 IST