భారత్‌లో కరోనా కేసులు ఇవాళ ఎంత శాతం పెరిగాయంటే..
ABN , First Publish Date - 2020-12-30T20:04:44+05:30 IST
భారత్‌లో కరోనా మహమ్మారి మరోసారి తీవ్రతను పెంచింది. మంగళవారంతో పోల్చుకుంటే బుధవారానికి కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య...

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి మరోసారి తీవ్రతను పెంచింది. మంగళవారంతో పోల్చుకుంటే బుధవారానికి కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 25 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లోనే అతి తక్కువగా మంగళవారం 16,432 కేసులు భారత్‌లో నమోదయ్యాయి. బుధవారం కొత్తగా 20,549 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. యూకే నుంచి భారత్‌కు వచ్చిన వారిలో ఇప్పటికే 20 మందికి స్ట్రెయిన్ వైరస్‌గా నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ కేసులు కూడా పెరుగుతుండటంతో కొంత ఆందోళన మొదలైంది.
కొత్త సంవత్సర వేడుకల పేరుతో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడకుండా చూడాలని, అవసరమైతే కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే కేంద్ర వైద్యఆరోగ్య శాఖ రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పలు నగరాల్లో ఇప్పటికే డిసెంబర్ 31 సాయంత్రం నుంచి జనవరి 1 ఉదయం వరకూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కర్ఫ్యూ విధించాయి.