ఏడో స్థానానికి భారత్
ABN , First Publish Date - 2020-06-01T06:53:48+05:30 IST
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఉధృతమైంది. గడచిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 8,380 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం రాత్రి 9.25 గంటల వరకు దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1,84,662కు చేరింది...
- దేశంలో1,84,662 కరోనా కేసులు
- ఒకేరోజు అత్యధికంగా 8,380 పాజిటివ్‌లు
న్యూఢిల్లీ, మే 31 (ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఉధృతమైంది. గడచిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 8,380 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం రాత్రి 9.25 గంటల వరకు దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1,84,662కు చేరింది. దీంతో కరోనా కేసుల్లో భారత్.. ప్రపంచంలో ఏడో స్థానానికి చేరింది. వీరిలో 91,100 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 88,239 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా బారిన పడ్డవారిలో ఇప్పటివరకు 5,323 మంది మరణించారు.
దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో ఇప్పటివరకు 65,168 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే 2,940 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోనూ ఒక్క రోజులో అత్యధిక కేసులు (1295) ఇప్పటివరకు 18,549 మందికి కరోనా సోకగా, 416మంది మృతి చెందారు. గుజరాత్‌లో 16,343 పాజిటివ్ కేసులు నమోదై.. 1,007 మంది మరణించారు. ఇదిలా ఉండగా.. కరోనా కట్టడికి తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల వ్యాధి నుంచి కోలుకుంటున్న రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లోనే 4,614 మంది కరోనా రోగులు వ్యాధి నుంచి కోలుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొంది. రికవరీ రేటు 47.76 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది.
ఢిల్లీలో ఇద్దరు ఏఎ్‌సఐల మృతి
కరోనా రక్కసి బారిన పడి ఢిల్లీలో ఇద్దరు పోలీస్ ఏఎ్‌సఐలు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు (54) క్రైం బ్రాంచ్‌కు చెందిన ఫింగర్ ప్రింట్ బ్యూరోలో పని చేస్తుండగా, మరొకరు(52) సుల్తాన్‌పురి పోలీ్‌సస్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి కరోనా బారిన పడ్డారు. హోం మంత్రిత్వశాఖ కంట్రోల్ రూమ్ వద్ద బాధ్యతలు పర్యవేక్షిస్తున్న సీఆర్‌పీఎఫ్ డీఐజీకి కూడా కరోనా వైరస్ సోకింది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రూప్ సీఈవో శివాశిష్ సర్కార్‌కూ పాజిటివ్‌గా తేలింది.
ఉత్తరాఖండ్ మంత్రికి కరోనా
ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ సహా ఆయన ప్రభుత్వం మొత్తం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయింది. ఆ రాష్ట్ర మంత్రి సత్‌పాల్ మహరాజ్‌కు ఆదివారం కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ వారంలోనే జరిగిన కేబినెట్ భేటీలో ఆయన పాల్గొనడంతో.. అదే సమావేశంలో పాల్గొన్న సీఎం, మంత్రివర్గమంతా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. కాగా, సత్‌పాల్ కుటుంబంలో 22 మందికి కరోనా సోకినట్లు తేలింది.