పాంగాంగ్‌పై భారత్ పాగా!
ABN , First Publish Date - 2020-09-03T07:38:15+05:30 IST
తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సుపై భారత్ దాదాపు పట్టు సాధించింది. సరస్సు దక్షిణ ప్రాంతంలోకి చొరబడేందుకు చైనా గత నెల 30వ తేదీన చేసిన ప్రయత్నాలను వమ్ముచేసిన భారత సైన్యం.. అక్కడి వ్యూహాత్మక శిఖరాలపై స్థావరాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే...

- ఉత్తర ప్రాంతమూ బలగాల కైవసం!!
- ఇప్పటికే దక్షిణ ప్రాంతం స్వాధీనం
- వ్యూహాత్మక పోస్టుల్లో మోహరింపు
- చైనా బలగాలకు అభిముఖంగా సైన్యం
- వ్యూహాన్ని పూర్తిగా మార్చేసిన భారత్
- చైనా దుర్నీతికి బలప్రయోగమే మందు!
- సైన్యానికి మోదీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
- డ్రాగన్ ఆక్రమించిన స్థలాల కైవసం
- గత నెల 22న భేటీలో నిర్ణయం?
- అరుణాచల్ సరిహద్దుకూ బలగాలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సుపై భారత్ దాదాపు పట్టు సాధించింది. సరస్సు దక్షిణ ప్రాంతంలోకి చొరబడేందుకు చైనా గత నెల 30వ తేదీన చేసిన ప్రయత్నాలను వమ్ముచేసిన భారత సైన్యం.. అక్కడి వ్యూహాత్మక శిఖరాలపై స్థావరాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తర ప్రాంతంలోనూ బలగాలను మోహరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తద్వారా చైనా బలగాలకు అభిముఖంగా భారత సైనికులు మోహరించినట్లయిందని సమాచారం. దీనివల్ల డ్రాగన్ బలగాల కదలికలు వారికి స్పష్టంగా తెలిసిపోతాయని అంటున్నారు. ఇదే సమయంలో ఫింగర్ 4 ప్రాంతాన్ని కూడా భారత సైన్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ వార్తలను సైనిక వర్గాలు తోసిపుచ్చాయి.
30వ తేదీన చేపట్టిన ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బలగాలను మోహరించామని.. సరస్సు ఉత్తరపు ఒడ్డున మన వైపు ఉన్న వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) పరిధిలోనే కొన్ని సర్దుబాట్లు చేశామని పేర్కొన్నాయి. ‘చైనా భూభాగంలోకి మనవాళ్లు అడుగుపెట్టలేదు. మన స్థావరాలనే పటిష్ఠపరిచారు’ అని వ్యాఖ్యానించాయి. ఇవన్నీ చూస్తుంటే చైనా విషయంలో భారత్ తన వ్యూహాన్ని సంపూర్ణంగా మార్చేసినట్లు అవగతమవుతోందని రక్షణ నిపుణులు అంటున్నారు. గత జూన్‌లో గల్వాన్ లోయలో భారత బలగాలపై దాడిచేసి 20 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న చైనా.. భారత బలగాల ప్రతిదాడిలో తన సైనికులనూ పెద్దసంఖ్యలో కోల్పోయింది. అనంతరం ఉభయదేశాల నడుమ దౌత్య, సైనిక చర్చలు జరుగుతున్నా.. ఫలితాలు శూన్యం. వాణిజ్య ఆంక్షలూ పనిచేయలేదు.. అంగీకరించిన ఒప్పందాలను సైతం చైనా ఉల్లంఘిస్తోంది. ఎల్‌ఏసీ వెంబడి కొన్ని చోట్ల తిష్ఠవేసిన తన బలగాలను వెనక్కి పిలవడం లేదు. మంచి మాటలతో డ్రాగన్ దారికి రాదని భారత నాయకత్వానికి అర్థమైంది. అందుకే తన వ్యూహాన్ని సంపూర్ణంగా మార్చేసింది. రాజకీయ నాయకత్వం నుంచి (మోదీ ప్రభుత్వం) నుంచి గ్రీన్‌సిగ్నల్ కూడా రావడంతో..సైనికపరంగా అత్యంత క్రియాశీలంగా వ్యవహరిస్తూ చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది.
వేచిచూడడం వేస్ట్..
ఇప్పటిదాకా చైనా దిగివచ్చేదాకా వేచిచూడాలని అనుకోవడం.. ఎల్‌ఏసీ వెంబడి భారీ స్థాయిలో మోహరించిన బలగాలను ఉభయ పక్షాలు వెనక్కి పిలవడం.. తద్వారా ఉద్రిక్తతలను తగ్గించి.. యథాతథ స్థితి కొనసాగేలా చూడాలని భారత్ భావించింది. అయితే చైనా రెచ్చగొట్టే చర్యలు చూశాక.. ఈ వైఖరితో సైనికపరంగానే గాక రాజకీయంగానూ సమస్యాత్మకమవుతుందని భారత వ్యూహకర్తలు గుర్తించారు. అందుకే క్రియాశీల వ్యూహాన్ని అమల్లోకి తెచ్చారు. చైనా అక్రమంగా తన భూభాగాలని చెబుతున్న జోన్లను బలవంతంగానైనా స్వాధీనం చేసుకోవడం.. దాని స్థావరాలను ధ్వంసం చేయడం ఈ వ్యూహంలో భాగం. అయితే ఇదెంత తీవ్రమైనా రిస్కో ప్రభుత్వానికి తెలుసు. అందుకే డ్రాగన్‌తో వివిధ స్థాయుల్లో చర్చలను కొనసాగిస్తూనే.. ఎల్‌ఏసీ వెంబడి క్రియాశీలంగా వ్యవహరించాలని భావిస్తోంది. ఎల్‌ఏసీ వెంబడి యథాతథ స్థితి కోసం చైనాతో సైనిక కమాండర్లు జరుపుతున్న చర్చలు ఫలించకపోతే ‘సైనిక చర్య’ అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు రక్షణ దళాల అధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ గత నెల 24న ప్రకటించారు. అంతకు 36 గంటల ముందే.. అంటే 22న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కీలక భేటీ నిర్వహించారు.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్, త్రివిధ దళాధిపతులు, సీడీఎస్, నిఘా విభాగం ఉన్నతాధికారులు దీనికి హాజరయ్యారు. ఆ సందర్భంగా క్రియాశీల వ్యూహాన్ని రూపొందించారు. రావత్ చేసిన ప్రకటన.. ఆ వ్యూహాన్ని బహిర్గతం చేసేదిగా ఉండడంతో సంయమనం పాటించాలని ఆయనకు రాజ్‌నాథ్ హితవు చెప్పినట్లు తెలిసింది. తర్వాత ఐదు రోజులకే చైనా మరోసారి దుస్సాహసానికి దిగడం, పాంగాగ్ దక్షిణ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడంతో.. అప్పటికే నిఘా సమాచారం రావడంతో అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం.. చైనా బలగాలను తరిమేశాయి. అంతేగాక పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతం మొత్తాన్ని తమ స్వాధీనంలోకి తీసుకుని... వ్యూహాత్మక ప్రాంతాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకోవడంతో చైనా బిత్తరపోయింది. ఈ స్థావరాల ఏర్పాటుతో చైనా కదలికలను గమనించేందుకు భారత్‌కు అవకాశం కలిగింది. ఇప్పుడు సరస్సు ఉత్తర ప్రాంతాన్ని కూడా అధీనంలోకి తీసుకుని చైనా బలగాలకు అభిముఖంగా మోహరించింది.
అరుణాచల్‌లో అప్రమత్తత..
అరుణాచల్ ప్రదే శ్ సరిహద్దులో చై నా దుస్సాహసానికి తెగబడే అవకాశం ఉండడంతో భారత సైన్యం అప్రమత్తమైంది. అదనపు బలగాలను అక్కడి ఎల్‌ఏసీకి తరలించింది. కాగా, నిరుడు చైనాలో 21 వేల మంది ఎంబీబీఎ్‌సలో చేరారు. వేసవి సెలవులకు వారు ఇంటికి వచ్చారు. ఈలోపు కరోనా విజృంభణ నేపథ్యంలో విదేశీ విద్యార్థుల పునరాగమనంపై చైనా ఆంక్షలు విధించింది. తదుపరి సూచనలు చేసేవరకు వారిని అనుమతించబోమని తెలిపింది. దీంతో విద్యార్థుల సమస్యను చైనా దృష్టికి భారత్ తీసుకెళ్లింది.
రాజకీయంగానూ కీలకం!
క్రియాశీల వ్యూహం తీవ్రమైన రిస్కులతో కూడుకున్నదే అయినా.. సరిహద్దుల రక్షణే తమ ప్రథమ ప్రాధాన్యమని.. దీనిపై రాజీకి ఆస్కారం ఇవ్వకూడదని మోదీ ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. భారత భూభాగాలను డ్రాగన్ ఆక్రమించిన విషయాన్ని కేంద్రం దాస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పైగా ఈ నెల 14 నుంచి ఆరంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో దీనిపై విపక్షాలు చర్చకు పట్టుబట్టే అవకాశముంది. అదీగాక త్వరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. జేడీయూతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఇక్కడ విజయం సాధించడం రాజకీయంగా కీలకం. ఈ నేపథ్యంలోనే క్రియాశీల వ్యూహానికి మోదీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని ఓ కీలక నేత వెల్లడించారు.