రష్యా సంచలన కామెంట్స్.. మౌనం వహించిన భారత్!

ABN , First Publish Date - 2020-12-10T16:17:36+05:30 IST

చైనా కట్టడి కోసం అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ దేశాల సభ్యత్వంతో ఏర్పాటైన క్వాడ్‌ కూటమిపై రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

రష్యా సంచలన కామెంట్స్.. మౌనం వహించిన భారత్!

న్యూఢిల్లీ: చైనా దూకుడుతో ప్రపంచ వ్యాప్తంగా సమీకరణాలు మారిపోతున్నాయి. వివిధ దేశాల మధ్య దశాబ్దాలుగా వస్తున్న సన్నిహిత సంబంధాలు కూడా ఒత్తిడికి లోనవుతున్నాయి. తాజాగా.. చైనా కట్టడి కోసం అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ దేశాల సభ్యత్వంతో ఏర్పాటైన క్వాడ్‌ కూటమిపై రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాను నియంత్రించేందుకు పాశ్చాత్య ప్రపంచం దూకుడుగా అనుసరిస్తున్న మోసపూరిత విధానంలో భారత్‌ ఓ వస్తువుగా మారిందని కామెంట్ చేశారు. అదే సమయంలో..భారత్-రష్యా దేశాల సన్నిహిత దౌత్య సంబంధాలను కూడా బలహీనపరిచేందుకు పాశ్చాత్య ప్రపంచం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మిలిటరీ వ్యవహారాలకు సంబంధించి సాంకేతిక సమన్వయం విషయంలో భారత్‌పై అమెరికా తెస్తున్న ఒత్తిడికి కారణం ఇదే ఆయన కామెంట్ చేశారు. మంగళవారం నాడు రష్యా అంతర్జాతీయ వ్యవహారల మండలిలో చేసిన ప్రసంగం సందర్భంగా సెర్గీ భారత్ ప్రస్తావన తెచ్చారు.


అయితే..క్వాడ్‌పై రష్యా ఆగ్రహం ప్రదర్శించడం కొత్తేమీ కాదు. అక్టోబర్‌లో జరిగిన క్వాడ్ దేశాల విదేశంగ మంత్రుల సమావేశానికి భారత్ తరఫున కేంద్ర మంత్రి ఎస్ జై శంకర్ హాజరయ్యారు. ఆ తరువాత నుంచీ రష్యా వ్యాఖ్యల్లో వాడీ వేడి పెరిగింది. ఇది అనేక ప్రశ్నలకు తావిస్తోంది. అయితే ఈ పరిణామం విషయంలో భారత్ మాత్రం మౌనాన్నే ఆశ్రయించింది. చైనా-రష్యాల మధ్య బలపడుతున్న దౌత్య సంబంధాలే ఈ వైఖరికి కారణమని ఢిల్లీ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.


అమెరికా వైఖరిపై రష్యాలో పెరుగుతున్న అసంతృప్తిని ప్రతిఫలిస్తూ మంత్రి సెర్గీ అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అమెరికా ఆధిపత్యంలో ఏక ధృవ ప్రపంచం పునరుద్ధరణకు పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగానే కనబుడుతోంది. కానీ..రష్యా, చైనా మాత్రం ఈ ఆధిపత్యానికి తలొగ్గవు. అందరికీ సమప్రాధాన్యం, ప్రాతినిథ్యం లభించే బహుళ ధృవ ప్రపంచంవైపుగా అంతర్జాతీయ పరిస్థితులు మారుతున్నాయి. అయితే.. అగ్రరాజ్యం మాత్రం ఈ పరిణామాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. రష్యా, చైనాలను ముందుగా పక్కన పెట్టిన, మిగతా దేశాలన్నిటీ ఏక ధృవ ప్రపంచంలో భాగం చేసేందుకు ప్రయత్నిస్తోంది’ అని సెర్గీ పేర్కొన్నారు. ‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఆవల వివిధ దేశాల ప్రయోజనాలను సమన్వయ పరిచే ఒకే వ్యవస్థ జీ20 కూటమి. ఇది..జీ7, బ్రిక్స్ దేశాల కూటమితో పాటూ బ్రిక్స్ విధానాన్ని సమర్థిస్తున్న అనేక దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తోంది. సమతుల విధానాలను ప్రోత్సహించేందుకు మిగిలున్న ఒకే ఒక ఆశ జీ20’ అని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2020-12-10T16:17:36+05:30 IST