టీకాల పవర్‌హౌస్‌.. భారత్‌

ABN , First Publish Date - 2020-07-20T07:36:08+05:30 IST

‘‘ప్రపంచం మొత్తానికీ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అందించగల శక్తి భారతదేశానికి ఉంది. భారత ఔషధ, టీకా కంపెనీలకు అద్భుతమైన సామర్థ్యం ఉంది.’’ మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ మూడు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలివి...

టీకాల పవర్‌హౌస్‌.. భారత్‌

అత్యంత ఖరీదైన వ్యాక్సిన్లను అందరికీ అందుబాటులోకి తెస్తున్న మన కంపెనీలు

ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 60శాతం భారత్‌ నుంచే


న్యూఢిల్లీ, జూలై 19: ‘‘ప్రపంచం మొత్తానికీ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అందించగల శక్తి భారతదేశానికి ఉంది. భారత ఔషధ, టీకా కంపెనీలకు అద్భుతమైన సామర్థ్యం ఉంది.’’ మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ మూడు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలివి. మనదేశంలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, బయో-ఈ, భారత్‌ బయోటెక్‌ వంటి సంస్థల పేర్లను ఉటంకించి మరీ ఆయన ప్రశంసించారు. బిల్‌గేట్స్‌ పొగడ్తలకు కారణం.. అత్యంత ఖరీదైన వ్యాక్సిన్లను ప్రజలకు అందుబాటు ధరల్లోకి తెచ్చిన చరిత్ర మన కంపెనీలకు ఉండడమే! నిజానికి మన దేశానికి ‘వ్యాక్సిన్ల ఉత్పత్తికి పవర్‌హౌస్‌’ అనే పేరుంది. దీనికి కారణం.. ఐక్యరాజ్యసమితి ఏటా తన టీకాల కార్యక్రమం కోసం సేకరించే వ్యాక్సిన్లలో 60 నుంచి 80 శాతం, ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 60 శాతం భారత్‌వే. ప్రపంచ ఆరోగ్య సంస్థ, బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ వంటివాటి కోసం పెద్ద ఎత్తున భారత కంపెనీలు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. అందుకే.. కొవిడ్‌-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోంది అని భారత్‌ బయోటెక్‌ ఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్లా అన్నారు. భారీగా ఉత్పత్తి చేయడమే కాదు.. చౌకగా వ్యాక్సిన్లను అందుబాటులోకి తేవడం భారత్‌ ప్రత్యేకత. అందుకు ఉదాహరణలు.. హెపటైటి్‌స-బి వ్యాక్సిన్‌, రోటా వైరస్‌ వ్యాక్సిన్‌. మన తెలుగువాడైన వరప్రసాద్‌ రెడ్డి కృషి, పట్టుదలకు ప్రతిరూపం అత్యంత చౌకధరకు లభించిన హెపటైటి్‌స-బి వ్యాక్సిన్‌! 1991-92 సమయంలో ఆ వ్యాక్సిన్‌ను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. అది కూడా రెట్టింపు ధరకు.


అమెరికాలో 18 డాలర్లు ఉండే వ్యాక్సిన్‌ను ఇక్కడ 35 డాలర్లకు అమ్మేవారు. అప్పటి కరెన్సీలో అది దాదాపు రూ.850 దాకా ఉండేది. ఆ వ్యాక్సిన్‌ను ఎలాగైనా సామాన్యులకు అందుబాటు ధరలోకి తేవాలన్న లక్ష్యంతో వరప్రసాద్‌రెడ్డి కృషిచేశారు. కేవలం ఆరేళ్లలో తన లక్ష్యాన్ని సాధించారు. 1997లో శాంతా బయోటెక్‌ కంపెనీ హెపటైటి్‌స-బి వ్యాక్సిన్‌ను ఒక డాలర్‌ కన్నా తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చి చరిత్ర సృష్టించింది. ఇక, డయేరియాకు కారణమైన రోటావైర్‌సను నిర్వీర్యం చేసే వ్యాక్సిన్‌ను ఒకప్పుడు విదేశీ కంపెనీలే ఉత్పత్తి చేసేవి. అది కూడా కేవలం రెండు వ్యాక్సిన్లు మాత్రమే ఉండేవి. వాటి ధరలు ఎక్కువగా ఉండేవి. అలాంటి రోటావైరస్‌ వ్యాక్సిన్‌ను భారత్‌ బయోటెక్‌ సంస్థ 2013లో కేవలం రూ.60కే అందుబాటులోకి  తెచ్చింది. అప్పటికి అందుబాటులో ఉన్న స్విస్‌, బ్రి టిష్‌ కంపెనీలు విక్రయించే వ్యాక్సిన్ల ధరలో పదిహేనో వంతు ధరకే ఈ వ్యాక్సిన్‌ను భారత్‌ బయోటెక్‌ విడుదల చేసింది.


మరిన్ని కంపెనీలు..

భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రధానంగా వినిపిస్తున్న పేరు భారత్‌ బయోటెక్‌ కంపెనీ రూపొందించిన కోవ్యాక్సిన్‌, జైడస్‌ క్యాడిలా కంపెనీ అభివృద్ధి చేసిన జైకొవ్‌-డి. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ-ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ను మనదేశంలో పెద్ద ఎత్తున తయారుచేయడానికి సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకా.. పనాసియా బయో టెక్‌, ఇండియన్‌ ఇమ్యూనలాజికల్స్‌, మిన్‌వ్యాక్స్‌, బయొలాజికల్‌-ఈ సంస్థలు కూడా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. మరోవైపు.. నేషనల్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ) అనుబంధ సంస్థ అయిన ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌.. కరోనా వ్యాక్సిన్‌ తయారీకి ఆస్ట్రేలియా గ్రిఫిత్‌ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది.


అందరికీ.. చాలా సమయం!

ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి ఒకే అంశంపై! అది.. ‘కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుంది? మార్కెట్లో అందరికీ అందుబాటులోకి ఎప్పుడొస్తుంది?’.. అని!! వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని పక్కన పెడితే.. అందరికీ వ్యాక్సిన్‌ వేయాలంటే భారీ సంఖ్యలో వేయాల్సి ఉంటుంది కాబట్టి అందుకు చాలా సమయం పడుతుందని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా అన్నారు. కొవిడ్‌-19కు మొదట వచ్చే వ్యాక్సినే అత్యుత్తమమైనది కాకపోవచ్చని.. వ్యాక్సిన్ల అభివృద్ధికి రకరకాల శాస్త్రీయ విధానాలను అనుసరిస్తారు కాబట్టి, వేచి చూసి అత్యుత్తమమైనదానినే ప్రపంచానికి ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై తమకు నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు. కాగా.. ఎస్‌ఐఐ తయారుచేసిన టీబీ నిరోధక వ్యాక్సిన్‌ వీపీఎం1002.. కొవిడ్‌పై పనిచేస్తుందా లేదా తెలుసుకునేందుకు క్లినికల్‌ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. ‘‘వెయ్యిమందికిపైగా ఈ వ్యాక్సిన్‌ ఇచ్చాం. అది కొవిడ్‌ తీవ్రతను తగ్గిస్తుందా లేదా అనే విషయం రెండు నెలల్లో తెలుస్తుంది’’ అని అదర్‌ పూనావాలా తెలిపారు.

Updated Date - 2020-07-20T07:36:08+05:30 IST