కోలుకున్నవారు భారత్‌లోనే అధికం
ABN , First Publish Date - 2020-09-20T07:50:48+05:30 IST
కరోనా రోగుల రికవరీలో భారత్.. అమెరికాను అధిగమించింది. అగ్ర రాజ్యంలో 69 లక్షల కేసులకు 41.92 లక్షల మంది కోలుకోగా, మన దేశంలో 53.08 లక్షల కేసులకు 42.08 లక్షల మంది రికవరీ అయ్యారు...

- దేశంలో 53 లక్షల కేసులకు 42 లక్షల రికవరీలు
- కొత్తగా రికార్డు స్థాయిలో 95,880 మంది..
న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: కరోనా రోగుల రికవరీలో భారత్.. అమెరికాను అధిగమించింది. అగ్ర రాజ్యంలో 69 లక్షల కేసులకు 41.92 లక్షల మంది కోలుకోగా, మన దేశంలో 53.08 లక్షల కేసులకు 42.08 లక్షల మంది రికవరీ అయ్యారు. అమెరికాలో 25 లక్షల యాక్టివ్ కేసులు ఉండగా, భారత్‌లో 10.13 లక్షలున్నాయి. దేశంలో శనివారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 95,880 మంది రికవరీ అయ్యారు. ఈ వ్యవధిలో నమోదైన కేసులు 93,337 మాత్రమే కావడం గమనార్హం.
వైర్‌సతో మరో 1,247 మంది మృతి చెందినట్లు కేంద్రం పేర్కొంది. శుక్రవారం కేవలం 8.81 లక్షల మందికే టెస్టులు చేశారు. గురువారం 10.06 లక్షల టెస్టులకు 96 వేల పాజిటివ్‌లు రాగా.. శుక్రవారం 8.81 లక్షల పరీక్షలకే 93 వేల కేసులు వచ్చాయి. నెల రోజుల్లో ఢిల్లీలో యాక్టివ్ కేసులు 190 శాతం మేర పెరిగాయి. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అశ్వథ్ నారాయణ్‌కు పాజిటివ్ వచ్చింది. మహారాష్ట్రలో కొత్త కేసులు 22 వేలలోపు ఉంటున్నా మరణాలు 400 పైనే నమోదవుతున్నాయి. నాగపూర్‌లోని ఆర్‌ఎ్‌సఎస్ ప్రధాన కార్యాలయంలో 9 మంది స్వయం సేవకులకు పాజిటివ్‌గా తేలింది. ఛత్తీ్‌సగఢ్ మాజీ సీఎం రమణ సింగ్‌కు కరోనా సోకింది. ఢిల్లీ సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా సామాజిక వ్యాప్తిని అంగీకరించాలని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ కేంద్రాన్ని కోరారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్ ప్రకటన చేయాలని అన్నారు. కరోనా బారినపడి ఆస్పత్రిలో చేరిన యుక్త వయస్కుల్లో 26 శాతం మందిలో న్యుమోనియా లక్షణాలు వృద్ధి చెందినట్లు దక్షిణ కొరియా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.