కొవిడ్-19: భారత ప్రభుత్వ చర్యలు సరిపోవట్లేదా?

ABN , First Publish Date - 2020-03-18T20:34:23+05:30 IST

కరోనా కట్టడికి భారత చర్యలు సరిపోతున్నాయా? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటోందంటే..

కొవిడ్-19: భారత ప్రభుత్వ చర్యలు సరిపోవట్లేదా?

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అడ్డుకోవటానికి వీలైనన్ని సార్లు కరోనా నిర్థారణ పరీక్షలు చేసి, రోగ నిర్ధారణ అయిన వారిని క్వారంటైన్ చేయాలని ప్రభుత్వాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. కానీ భారత్ ప్రస్తుతానికి పరిమిత స్థాయిలోనే ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా విదేశాలనుంచి తిరిగొచ్చిన వారికి, వారితో పరిచయమున్న వారికి, కరోనా లక్షణాలు కలిగి ఉన్న వారికి ఈ పరీక్షలను నిర్వహిస్తోంది.


భారత్‌లో కరోనా వ్యాధి ప్రస్తుతం రెండో దశలో ఉన్న విషయం తెలిసిందే. వ్యాధి మూడో దశకు చేరుకుంటే.. విదేశీ పర్యటనలు చేయని వారు కూడా కరోనా బారిన పడతారు. మరి వ్యాధి ఈ స్తాయికి చేరుకోకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ర్యాండమ్ సాంప్లింగ్ విధానం ద్వారా దేశవ్యాప్తంగా శ్వాసకోస సమస్యలను ఎదుర్కొంటున్న 1000 మందిని ఎంచుకుని వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది. వీరెవ్వరూ గతంలో విదేశీ పర్యటనలకు వెళ్లలేదు. ఇలాంటి వారిని ఎంచుకోవడం ద్వారా భారత్‌లో కరోనా మూడో దశకు చేరుకుందో లేదో తెలుస్తుంది. 


అయితే వ్యాధి కట్టడికి ఇది సరిపోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. వ్యాధి వ్యాప్తికి అడ్డుకునేందుకు సమగ్రమైన వ్యూహం అవసరమని, వీలైనన్ని ఎక్కువ పరీక్షలు నిర్వహించాలని, ప్రైవేటు ల్యాబుల్లో కూడా ఈ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అయితే టెస్టుల సంఖ్య తక్కువగా ఉండటానికి కారణం తగినన్ని పరీక్షల కిట్లు అందుబాటులోకి లేకపోవడమే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ కరోనా కిట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. కానీ విదేశీ పర్యటనలపై నిషేధం ఉండటంతో అవసరమైన మేర కరోనా కిట్లు అందుబాటులో ఉండటం లేదు. ఇక చెన్నైకి చెందిన ఓ సంస్థ కరోనా కిట్‌ను తయారు చేసినప్పటికీ అది అన్ని అనుమతులూ పొంది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే రెండు నుంచి మూడు వారాల సమయం పట్టొచ్చని ఈ వ్యావహారంతో సంబంధం ఉన్న వారు వ్యాఖ్యానిస్తున్నారు.


కాగా.. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్జ్‌(ఐసీఎమ్‌ఆర్)  డైరెక్టర్ జనరల్ మాత్రం ఇప్పటి వరకూ ర్యాండమ్ సాంప్లింగ్ విధానంలో చేపట్టిన కరోనా నిర్ధారణ పరీక్షలన్నిటిలో అధిక శాతం వ్యాధి లేనట్టు తేలిందన్నారు. మిగతా రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందన్నారు. ఫిబ్రవరి నెలలో 1000 మందిపై, మర్చి 15 వరకూ మరో వేయ్యి మందిపై ఈ పరీక్షలు నిర్వహించనట్టు తెలిపారు. ప్రస్తుతం ఐసీఎమ్ఆర్ ఆధ్వర్యంలో 72 ల్యాబ్‌లల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వారం చివరికల్లా మరో 49 ప్రభుత్వ ల్యాబ్‌లు అందుబాటులోకి రానున్నాయి.


ఈ వారాంతాని కల్లా మొత్తం 121 ల్యాబులు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. వీటిలోని 119 కేంద్రాల్లో ఒక్కోదానిలో రోజుకు 180 పరీక్షలు నిర్వహించవచ్చని మిగిలిన రొండు ర్యాపిడ్ టెస్టింగ్ ల్యాబుల్లో రోజుకు 1400 టెస్టులు చేయచ్చని చెబుతున్నారు. వీటికి అదనంగా 51 ప్రైవేటు ల్యాబులు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇక భారత్‌లో మొత్తం పది లక్షల పరీక్షల కిట్లు అందుబాటులో ఉంచుతామని, ఇందు కోసం ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థకు, జర్మనీకి ఆర్డర్ పెట్టామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2020-03-18T20:34:23+05:30 IST