ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికార పరిరక్షణకు భారత్ సిద్ధం: మోదీ

ABN , First Publish Date - 2020-10-31T20:55:02+05:30 IST

భారత భూభాగంపై కన్నేసే శత్రువులకు ధీటైన సమాధానం ఇచ్చే శక్తి దేశ సైనికులకు ..

ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికార పరిరక్షణకు భారత్ సిద్ధం: మోదీ

కెవడియా: భారత భూభాగంపై కన్నేసే శత్రువులకు ధీటైన సమాధానం ఇచ్చే శక్తి దేశ సైనికులకు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికార పరిరక్షణ, ప్రతిష్టను కాపాడేందుకు భారత్ పూర్తి సన్నద్ధంగా ఉందని పేర్కొన్నారు. సర్దార్ వల్ల‌భాయ్ పటేల్ జయంత్యుత్సవం సందర్భంగా గుజరాత్‌లో ప్రధాని మాట్లాడుతూ... 'సరిహద్దుల విషయంలో ఇండియా తీరు, విధానం మారింది. మనపై చెడుతలంపుతో కన్నేసే వారికి సమర్ధవంతంగా బదులు చెప్పేందుకు మన సాహస సైనికులు సర్వ సన్నద్ధంగా ఉన్నారు. మన సరిహద్దుల్లో భద్రతా సామగ్రి, మౌలిక వసతుల కల్పన గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉంది' అని మోదీ స్పష్టం చేశారు.


కొన్ని శక్తులు బహిరంగంగా ఉగ్రవాదానికి మద్దతుగా నిలవడం ప్రపంచ శాంతి, మానవత్వానికి భంగకరమని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోందని అన్నారు. ఉగ్రవాదానికి సాయం చేస్తూ, ప్రోత్సహిస్తున్న శక్తులను అన్ని దేశాలు, ప్రభుత్వాలు, అన్ని వర్గాలు సమష్టిగా మట్టికరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని, ఉగ్రవాదం, హింసతో ఏ దేశం లబ్ధి పొందకుండా చూడాలని అన్నారు.


పుల్వామా దాడిలో భద్రతా సిబ్బంది త్యాగాలను తాము ఎన్నటికీ మరువమని, దీనిపై కొందరికి ఏమాత్రం విచారం లేదని అన్నారు. వీరు కేవలం రాజకీయాలు చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల రీత్యా ఇలాంటి రాజకీయాలు చేయవద్దని వారిని తాను కోరుతున్నానని అన్నారు. పొరుగు దేశం పుల్వామా దాడిలో నిజం ఏమిటో ఒప్పుకుందని, తద్వారా ఈ ఘటనను రాజకీయం చేయాలనుకున్న వారి నిజస్వరూపం బయట పడిందని మోదీ విమర్శించారు.


కోవిడ్‌ మహమ్మారిపై 130 కోట్ల మంది భారతీయులు సమష్టి పోరాటం చేశారని ప్రధాని ప్రశంసించారు. అసాధారణ రీతిలో స్పందిచారని అన్నారు. గుజరాత్‌లో టూరిజం అభివృద్ధిపై మాట్లాడుతూ, సర్దర్ సరోవర్ నుంచి సబర్మతి రివర్‌ఫ్రంట్ వరకూ సీప్లేన్ సర్వీసు మొదలవుతోందని, ఇది రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి మరింత దోహదపడుతుందని అన్నారు. ఉద్యోగాల కల్పనలో గిరిజనులకు సమప్రాధాన్యం లభిస్తుందని చెప్పారు. రాష్ట్రం సాధిస్తున్న ప్రగతికి గాను గుజరాత్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను అభినందిస్తున్నానని అన్నారు.


'జంగిల్ సఫారి పార్క్, ఏక్తా మాల్, చిల్ట్రన్స్ న్యూట్రిషియన్ పార్క్, ఆరోగ్య వ్యాన్ వంటి కొంత ప్రదేశాలను కెవడియాలో ప్రాంభించాం.  రాబోయే రోజుల్లో 'మా నర్మదా' ప్రాంతం దేశంలోనే కాకుండా ప్రపంచ పర్యాటక చిత్రపటంలో చోటుచేసుకుంటుంది' అని ప్రధాని అన్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా కూడా ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Read more