భారత్‌కు కరోనాను కట్టడి చేసే సత్తా

ABN , First Publish Date - 2020-03-25T07:45:18+05:30 IST

మశూచి, పోలియో వంటి మహమ్మారులను ఎదుర్కొని వాటిని నిర్మూలించిన భారతదేశానికి.. కొవిడ్‌-19ను కూడా సమర్థంగా ఎదుర్కొనే, నిర్మూలించే గొప్ప సామర్థ్యం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ...

భారత్‌కు కరోనాను కట్టడి చేసే సత్తా

మశూచి, పోలియోలను తుడిచిపెట్టిన ఘనచరిత్ర.. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రశంస

వేగంగా విస్తరిస్తోంది: డబ్ల్యూహెచ్‌వో


జెనీవా, మార్చి 24: మశూచి, పోలియో వంటి మహమ్మారులను ఎదుర్కొని వాటిని నిర్మూలించిన భారతదేశానికి.. కొవిడ్‌-19ను కూడా సమర్థంగా ఎదుర్కొనే, నిర్మూలించే గొప్ప సామర్థ్యం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఎగ్జిక్యూటివ్‌ డెరైక్టర్‌ మైకేల్‌ ర్యాన్‌ అభిప్రాయపడ్డారు. కొవిడ్‌-19 మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇప్పటికీ దాన్ని కట్టడి చేసే అవకాశం ఉందన్నారు. ‘‘డిసెంబరు చివర్లో మొదలైన ఈ వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి సోకడానికి 67 రోజులు పట్టింది. అక్కడి నుంచి మరో లక్ష మందికి సోకడానికి కేవలం 11 రోజులు పట్టింది. ఆ తర్వాత.. మూడో లక్షకు చేరడానికి కేవలం నాలుగంటే నాలుగే రోజులు పట్టింది. ఈ సంఖ్యలు పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. వేగంగా విస్తరిస్తున్న వైరస్‌ గతిని మనంమార్చగలం’’ అని ధీమా వ్యక్తం చేశారు. కొవిడ్‌-19 బాధితులకు చేసే చికిత్సలో భాగంగా ‘పరీక్షించని మందులను (అన్‌టెస్టెడ్‌ డ్రగ్స్‌)’ ఇవ్వవద్దని.. డ్రగ్‌ ట్రయల్స్‌ను ఎలా పడితే అలా నిర్వహించవద్దని పరిశోధకులను కోరారు. సరైన ఆధారాలు లేకుండా.. పరీక్షించని మందులను రోగులకిస్తే అది వారిలో అనవసరపు ఆశలను రేకెత్తిస్తుందని, దానివల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందని టెడ్రోస్‌ పేర్కొన్నారు. ప్రజలు ఆ మందుల కోసం ఎగబడితే.. ఇతర వ్యాధులతో బాధపడుతూ ఆ మందులపై ఆధారపడేవారికి ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. 


గాలిలో వ్యాపించదు

కొవిడ్‌-19 వైరస్‌ గాలిలో వ్యాపించదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా డైరెక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ స్పష్టం చేశారు. ఆ వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందనడానికి ఆధారాల్లేవని.. కేవలం దగ్గు, తుమ్ము తుంపర్ల ద్వారా, వైరస్‌ బారిన పడినవారిని తాకడం, వారికి దగ్గరగా మసలడం ద్వారానే వ్యాపిస్తుందని తేల్చిచెప్పారు. అయితే.. గాలి, వెలుతురు రాని ప్రదేశాల్లో, ఎక్కువ సమయంపాటు మూసి ఉండే ప్రదేశాల్లో మాత్రం ఈ సమస్య ఉండొచ్చని చైనా అధికారులు తెలిపినట్టు ఆమె వివరించారు.

Updated Date - 2020-03-25T07:45:18+05:30 IST