పూల్‌ టెస్టింగ్‌ బెస్ట్‌!

ABN , First Publish Date - 2020-04-12T05:50:28+05:30 IST

భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అనుమానిత లక్షణాలుంటే చాలు.. వారి నుంచి శాంపిల్స్‌ తీసి ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. దీంతో వైరాలజీ ల్యాబ్‌లపై భారం...

పూల్‌ టెస్టింగ్‌ బెస్ట్‌!

భారత్‌లో ఈ తరహా పరీక్షలు ఉత్తమం

ఒకేసారి 64 మంది శాంపిల్స్‌ పరీక్ష

నెగెటివ్‌ వస్తే అందరికీ నెగెటివ్‌

పాజిటివ్‌ వస్తే.. మళ్లీ పూల్స్‌గా విభజన

అమెరికా వర్సిటీ అధ్యయనం సూచన


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 11: భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అనుమానిత లక్షణాలుంటే చాలు.. వారి నుంచి శాంపిల్స్‌ తీసి ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. దీంతో వైరాలజీ ల్యాబ్‌లపై భారం పెరిగిపోతోంది. శాంపిల్స్‌ స్వీకరణ నుంచి దాన్ని వివిధ దశల్లో పరీక్షించడం.. రిపోర్టు తయారు చేయడం.. వాటిని ఆస్పత్రులకు పంపడం ఇలా.. ఒక్కోదానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. సిబ్బంది 24 గంటలూ పనిచేసినా రోజుకు 100 లోపు శాంపిల్స్‌ను పరీక్షించడం కూడా కష్టమైపోతోంది. అయితే అత్యధిక జనాభా కలిగిన భారత్‌లాంటి దేశాల్లో పూల్‌ టెస్టింగ్‌ ప్రక్రియ ఉత్తమం అని అమెరికాలోని టెక్సాస్‌ ఏ అండ్‌ ఎం యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం చెబుతోంది. అనేక మంది శాంపిల్స్‌ను కలిపి ఒకేసారి పరీక్షించడం ద్వారా బోలెడంత సమయాన్ని ఆదా చేసుకోవచ్చనేది ఈ అధ్యయనం వెల్లడిస్తోంది. అన్ని శాంపిల్స్‌ను కలిపి పరీక్షించినపుడు నెగెటివ్‌ వస్తే ఆ శాంపిల్స్‌ వారందరికీ నెగెటివ్‌ వచ్చినట్టే. ఒకవేళ పాజిటివ్‌ వస్తే వాటిని మళ్లీ నాలుగైదు పూల్స్‌గా విభజించి పరీక్షిస్తారు. కొవిడ్‌-19 పరీక్షలను ఎక్కువ మొత్తంలో నిర్వహించేందుకు రియల్‌ టైమ్‌ రివర్స్‌ ట్రాన్స్‌స్ర్కిప్షన్‌ పాలిమరీస్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్‌టీ-పీసీఆర్‌) పరీక్ష సాధ్యాసాధ్యాలను పరిశోధకులు అంచనా వేశారు. ఈ పద్ధతిని ఉపయోగించి సమర్థ పూలింగ్‌ వ్యూహాలను అన్వేషించడానికి వారు గణిత విశ్లేషణను అనుసరించారు. 64 మంది నమూనాలను ఒకే టెస్ట్‌ ట్యూబ్‌లోకి తీసుకుని వారు పరీక్షలు నిర్వహించారు. ‘ఒక్కో శాంపిల్‌ను పరీక్షించాలంటే చాలా సమయం పడుతుంది. పైగా ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పూల్‌ టెస్టింగ్‌ ద్వారా దాన్ని అధిగమించవచ్చు. ఫలితాల నిర్ధారణలో 95 శాతం కచ్చితత్వం ఉంటుంది’ అని టెక్సాస్‌ ఏ అండ్‌ ఎం యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కృష్ణ నారాయణన్‌ తెలిపారు.


అసలు ఈ టెస్టింగ్‌ ఏమిటి?

ప్రస్తుతం కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలను విడివిడిగా చేస్తున్నారు. దీనికి ఎక్కువ సమయం పడుతోంది. ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. పూల్‌ టెస్టింగ్‌లో ఒకేసారి 64 మంది శాంపిల్స్‌ను టెస్ట్‌ట్యూబ్‌లో వేసి పరీక్షిస్తారు. రిపోర్టులో నెగెటివ్‌ వస్తే వారందరికీ నెగెటివ్‌ వచ్చినట్టే. ఒకవేళ పాజిటివ్‌ వస్తే మాత్రం వాటిని మళ్లీ నాలుగైదు పూల్స్‌గా విభజించి పరీక్షిస్తారు. నెగెటివ్‌ వచ్చినవి పక్కనబెట్టి.. పాజిటివ్‌ వస్తే వాటిని మళ్లీ విడివిడిగా పరీక్షిస్తారు. తక్కువ వనరులు ఉన్న సమయంలో ఈ పూల్‌ టెస్టింగ్‌ బాగా ఉపయోగపడుతుంది. పైగా పూల్‌ టెస్టింగ్‌కు ఉపయోగించే ఆర్‌టీ-పీసీఆర్‌ విధానం నమ్మదగినది.


జర్మనీలోనూ కొత్త పద్ధతి

జర్మన్‌ రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ డోనర్‌ సర్వీ్‌సకు చెందిన ప్రొఫెసర్‌ ఎరార్డ్‌ సెఫ్రీడ్‌ కూడా పరిమిత టెస్ట్‌ కిట్లు, పరిమిత వనరుల దృష్ట్యా పీసీఆర్‌ పద్ధతి ఉత్తమ ఫలితాలు అందిస్తుందని చెప్పారు. పైగా అధిక జనాభా కలిగిన దేశాల్లో దీన్ని వినియోగిస్తే మేలని సూచించారు. జర్మనీ ఈ కొత్త పద్ధతి ద్వారా కొవిడ్‌-19కు వ్యతిరేక పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లగలదని ఆయన అభిప్రాయపడ్డారు.


రోజుకి 4 లక్షల శాంపిల్స్‌..

‘పూల్‌ టెస్టింగ్‌ ద్వారానే రోజుకి 4 లక్షల శాంపిల్స్‌ను పరీక్షించే స్థాయికి జర్మనీ చేరుకుంటుంది. ఉదాహరణకు పూల్‌ టెస్టింగ్‌లో 16 శాంపిల్స్‌ను ఒకేసారి పరీక్షిస్తే అది నెగెటివ్‌ వస్తే ఆ 16 మందికీ నెగెటివ్‌ వచ్చినట్టే. లేదంటే.. పాజిటివ్‌ కోసం బైనరీ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ పూల్‌ టెస్టింగ్‌ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ ఉపయోగించవచ్చు’ అని మార్టిన్‌ కోపెల్‌మన్‌ అనే వ్యక్తి ట్వీట్‌ చేశారు.



Updated Date - 2020-04-12T05:50:28+05:30 IST