ఆర్మీ క్యాంటీన్లలో విదేశీ వస్తువుల విక్రయంపై నిషేధం
ABN , First Publish Date - 2020-10-24T13:25:22+05:30 IST
భారత రక్షణ మంత్రిత్వశాఖ విదేశీ వస్తువుల విక్రయంపై సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.....

న్యూఢిల్లీ : భారత రక్షణ మంత్రిత్వశాఖ విదేశీ వస్తువుల విక్రయంపై సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని ఆర్మీ క్యాంటీన్లలో విదేశీ వస్తువుల విక్రయంపై నిషేధం విధిస్తూ కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో మొత్తం 4వేల ఆర్మీ క్యాంటీన్లలో విదేశీ మద్యంతోపాటు వస్తువులను విక్రయించరాదని రక్షణ మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఆర్మీక్యాంటీన్లలో సైనికులు, మాజీ సైనికుల కుటుంబాలకు విదేశీ మద్యంతోపాటు ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయించేవారు. భవిష్యత్తులో విదేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోరాదని రక్షణ మంత్రిత్వశాఖ అంతర్గత ఉత్తర్వుల్లో కోరింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వదేశీ వస్తువుల విక్రయం నినాదానికి మద్ధతుగా తాము విదేశీ వస్తువులను ఆర్మీ క్యాంటీన్లలో విక్రయించరాదని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు అధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని రక్షణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి చెప్పారు. పెర్నాడ్, డియాజియో మద్యం దిగుమతులను కూడా నిలిపివేశారు. చైనా సరిహద్దుల్లో ఇటీవల జరిగిన దాడి నేపథ్యంలో చైనా ఉత్పత్తులను నిలిపివేశామని ప్రభుత్వం ప్రకటించింది.