తలపడేందుకు అనువైన దూరంలో భారత్, చైనా యుద్ధ ట్యాంకులు
ABN , First Publish Date - 2020-09-01T19:51:04+05:30 IST
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు క్షణక్షణం పెరుగుతున్నాయి.

న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు క్షణక్షణం పెరుగుతున్నాయి. మే నెలలో ప్రారంభమైన ఉద్రిక్త వాతావరణం, జూన్‌లో చైనా సైనికుల దాడితో మరింత పెరిగింది. తాజాగా ఆగస్టు 29 రాత్రి చైనా దళాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం ఉద్రిక్తతల్ని మరింత పెంచింది.
సైనిక కమాండర్ల స్థాయి చర్చలు రెండో రోజైన మంగళవారం కూడా కొనసాగుతున్నప్పటికీ, భారత్, చైనా యుద్ధ ట్యాంకులు పరస్పరం కాల్పులు జరిపేందుకు అనువైన దూరంలో నిలిచి ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చైనా యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు నిండిన వాహనాలు కాలా టాప్ ఫుట్‌హిల్స్ వద్ద ఉన్నాయని తెలుస్తోంది. కాలా టాప్ వద్ద భారతీయ దళాలు మోహరించాయి.
భారతీయ దళాలతో తలపడేందుకు అవసరమైనంత సమీపంలో చైనాకు చెందిన హెవీ ట్యాంకులు, లైట్ ట్యాంకులు ఉన్నట్లు సమాచారం. భారత దేశానికి చెందిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ కాలా టాప్ వద్ద పట్టు బిగించడంతో చైనీస్ ట్యాంకులు, మెషినరీ రవాణా నిలిచిపోయిందని చెప్తున్నారు. స్పంగుర్ ట్సో, చూసుల్ మధ్యలో ఇండియన్ ట్యాంక్ రెజిమెంట్‌ను మోహరించారని తెలుస్తోంది.
ఇదిలావుండగా, మోల్డోలో మంగళవారం ఉదయం 9 గంటలకు భారత్, చైనా బ్రిగేడ్ కమాండర్ల స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తొలగించేందుకు వీరు చర్చలు జరుపుతున్నారు.