అమెరికాలో మళ్లీ..

ABN , First Publish Date - 2020-05-09T08:46:46+05:30 IST

ఉధృతి తగ్గినట్లే తగ్గిన అమెరికాలో మళ్లీ భారీగా మరణాలు.. రష్యాలో వరుసగా ఆరో రోజూ 10 వేలపైనే కేసులు.. ప్రపంచవ్యాప్తంగా 40 లక్షలకు చేరువైన బాధితుల

అమెరికాలో మళ్లీ..

  • అగ్రరాజ్యంలో పెరుగుతున్న మరణాలు


వాషింగ్టన్‌, న్యూజెర్సీ, మాస్కో, మే 8: ఉధృతి తగ్గినట్లే తగ్గిన అమెరికాలో మళ్లీ భారీగా మరణాలు.. రష్యాలో వరుసగా ఆరో రోజూ 10 వేలపైనే కేసులు.. ప్రపంచవ్యాప్తంగా 40 లక్షలకు చేరువైన బాధితుల సంఖ్య..! ఇదీ శుక్రవారం కరోనా విజృంభణ తీరు. అగ్రరాజ్యంలో పరిస్థితి కాస్త మెరుగుపడినట్లు కనిపించినా, మరణాలు పెరుగుతున్నాయి. తాజాగా 1,791 మంది ప్రాణాలు కోల్పోయారు. 29 వేలపైగా కొత్త కేసులతో మొత్తం కేసులు 13 లక్షలు దాటాయి. వైట్‌హౌ్‌స మీడియా సమావేశంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి చైనాపై ఆరోపణలు గుప్పించారు. చైనా ఘోర తప్పిదం, అసమర్థత కారణంగానే వైరస్‌ ప్రపంచమంతా వ్యాపించిందని నిందించారు. అక్కడో ఏదో జరిగిందని, ఇది చాలా దారుణమని వ్యాఖ్యానించారు.  


హుబెయ్‌లో లక్షణాలు కనిపించని కేసులు

చైనాలో శుక్రవారం 17 పాజిటివ్‌ కేసులు నమోదవగా.. వీటిలో 16 లక్షణాలు కనిపించని కేసులు హుబెయ్‌ ప్రావిన్స్‌లోనే రికార్డయ్యాయి. అఫ్గానిస్థాన్‌ ఆరోగ్య శాఖ మంత్రి ఫెరోజుద్దీన్‌ ఫెరోజ్‌కు పాజిటివ్‌ అని తేలింది. పాకిస్థాన్‌లో శుక్రవారం 1,764 కేసులు నమోదయ్యాయి. బంగ్లాదేశ్‌లో వైద్య విద్య చదువుతున్న 168 మంది భారత విద్యార్థులను వి మానంలో శ్రీనగర్‌ తీసుకొచ్చారు. న్యూజెర్సీలో భారత సంతతికి చెందిన డాక్టర్‌ సత్యేందర్‌ దేవ్‌ ఖన్నా(78) కరోనా బారినపడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రోజుల వ్యవధిలోనే ఆయన కుమార్తె, డాక్టర్‌ ప్రియా ఖన్నా (43) సైతం వైర్‌సకు బలయ్యారు. ఈ ఇద్దరూ పనిచేసిన ఆస్పత్రిలోనే ప్రాణాలు విడిచారు


పేద దేశాలకు ఐక్యరాజ్యసమితి సాయం

కరోనాతో విపత్కర పరిస్థితుల్లో ఉన్న పేద దేశాలకు సాయం చేసేందుకు ఐక్యరాజ్య సమితి చొరవ చూపుతోంది. దీనికి సమితి, భాగస్వామ్య సంస్థలు 6.7 బిలియన్‌ డాలర్లను సమీకరించనున్నాయి. ఈ నిధులను పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌ సహా 50 పైగా దేశాల్లో ఆహార కొరత నివారణ, లింగ వివక్ష నిర్మూలనకు వెచ్చిస్తారు.

Updated Date - 2020-05-09T08:46:46+05:30 IST