‘నగదు చలామణి పెరగడం అనిశ్చితికి సంకేతం’

ABN , First Publish Date - 2020-06-23T23:48:29+05:30 IST

నోవల్ కరోనా వైరస్ మహమ్మారి కొత్తదనం తన పేరులోనే కాదు ప్రపంచానికి

‘నగదు చలామణి పెరగడం అనిశ్చితికి సంకేతం’

న్యూఢిల్లీ : నోవల్ కరోనా వైరస్ మహమ్మారి కొత్తదనం తన పేరులోనే కాదు ప్రపంచానికి విసురుతున్న సవాళ్ళు కూడా కొత్తగానే ఉన్నాయి. అన్ని రంగాల వారికీ అనేక రకాలుగా ఇబ్బందులు సృష్టిస్తోంది. ఉద్యోగులు జీతాల కోతలతో సతమతమవుతున్నారు. వ్యాపారులు సంక్షోభంలో చిక్కుకున్నారు. 


ఇటువంటి సమయంలో గత ఏడాదితో పోల్చితే, ఈ ఏడాది చలామణి అవుతున్న నగదు అధికంగా కనిపిస్తోంది. దీనికి కారణం కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన అనిశ్చితి తీవ్రంగా ఉండటంతో, ప్రజలు జీతాల కోతలు, ఉద్యోగాలు కోల్పోవడం వంటి వాటి నుంచి తమను తాము కాపాడుకునేందుకు, తమకు అందుబాటులో ఉన్న చోట డబ్బును నిల్వ చేస్తుండటమేనని నిపుణులు చెప్తున్నారు. 


బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్లు వంటివాటిలో ప్రజలు దాచుకుంటున్న సొమ్ము గత ఏడాదితో పోల్చుకుంటే, ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో 6.7 శాతం పెరిగిందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది ఏడేళ్ళలో అత్యధిక వృద్ధి. 


చలామణిలో ఉన్న కరెన్సీ, అంటే, ప్రజల వద్ద, బ్యాంకుల్లో ఉన్న నగదు కూడా పెరిగింది. డబ్బు సరఫరా పెరుగుదలను వినియోగం, వ్యాపార పెట్టుబడుల్లో పెరుగుదలకు సంకేతంగా సాధారణంగా పరిగణిస్తారు. అయితే ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉందని నిపుణులు చెప్తున్నారు. 


ప్రస్తుతం ప్రజలు అష్ట దిగ్బంధనం సమయంలో తమ అవసరాల కోసం డబ్బును బ్యాంకు ఖాతాల నుంచి తీసుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వ్యక్తులు తమ వద్ద ఉన్న సొమ్మును బ్యాంకుల్లో జమ చేస్తున్నారని, అదేవిధంగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని రుణదాతలు కూడా ఇతరులకు అప్పులు ఇవ్వకుండా, తమ సొమ్మును బ్యాంకుల్లో జమ చేస్తున్నారని అంటున్నారు. 


బ్యాంకుల్లో జమ అయిన సొమ్ము కన్నా ఎక్కువగా ప్రజల వద్ద కరెన్సీ నోట్లు ఉన్నాయని చెప్తున్నారు. నగదు ఉపసంహరణలు పెరిగినందువల్ల సేవింగ్స్ అకౌంట్ , కరెంట్ అకౌంట్ డిపాజిట్లు 8 శాతం తగ్గినట్లు గణాంకాలు చెప్తున్నాయి. 


ప్రజలు తమ నిలకడైన ఆదాయం పట్ల నమ్మకం లేకపోవడంతో ఖర్చులను తగ్గించుకుంటున్నారని విశ్లేషకులు చెప్తున్నారు.


ఈ ఏడాది చలామణిలో ఉన్న కరెన్సీ పెరగడం వృద్ధికి సంకేతం కాదని, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడిన అనిశ్చితికి సంకేతమని వివరిస్తున్నారు.


Updated Date - 2020-06-23T23:48:29+05:30 IST