డాక్టర్లపై దాడులు తగ్గాయి

ABN , First Publish Date - 2020-09-20T07:29:10+05:30 IST

కొవిడ్‌ కష్టకాలంలో పని చేస్తున్న వైద్య సిబ్బందికి రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన మహమ్మారి రోగాల సవరణ బిల్లు-2020కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. ప్రాణాలకు తెగించి ఆస్పత్రుల్లో కరోనా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లపై, ఇతర వైద్య సిబ్బందిపై వివక్ష చూపడం...

డాక్టర్లపై దాడులు తగ్గాయి

  • రాజ్యసభలో మంత్రి హర్షవర్ధన్‌ వ్యాఖ్యలు
  • మహమ్మారి రోగాల బిల్లుకు ఆమోదం
  • రాష్ట్రాల హక్కుల్లో జోక్యం వద్దన్న సభ్యులు
  • పారిశుధ్య సిబ్బందికీ రక్షణ కోసం విజ్ఞప్తి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: కొవిడ్‌ కష్టకాలంలో పని చేస్తున్న వైద్య సిబ్బందికి రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన మహమ్మారి రోగాల సవరణ బిల్లు-2020కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. ప్రాణాలకు తెగించి ఆస్పత్రుల్లో కరోనా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లపై, ఇతర వైద్య సిబ్బందిపై వివక్ష చూపడం, దాడులు చేయడం పెరిగిపోవడంతో కేంద్రం గత ఏప్రిల్‌ 22న వారికి రక్షణ కల్పిస్తూ ఆర్డినెన్స్‌ తెచ్చింది. 1897 నాటి మహమ్మారి రోగాల చట్టానికి సవరణలు చేసింది. దాని ప్రకారం మహమ్మారులు వ్యాపించిన సమయాల్లో వైద్య సిబ్బందిపై హింసకు పాల్పడ్డా, రెచ్చగొట్టినా మూడు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలుశిక్ష వేస్తారు. 50 వేల నుంచి రెండు లక్షల వరకు జరిమానా విధిస్తారు.  ఏప్రిల్లో ఆర్డినెన్స్‌ తెచ్చిన తర్వాత వైద్య సిబ్బందిపై దాడులు తగ్గిపోయాయని ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ తెలిపారు. ఈ బిల్లుపై శనివారం రాజ్యసభలో చర్చ జరిగినపుడు కేంద్ర ప్రభుత్వం కొవిడ్‌ నియంత్రణ పేరుతో రాజ్యాంగ పరిమితులను దాటి రాష్ట్రాలపై పెత్తనం చేస్తోందని, అదే సమయంలో ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించడంలో, వలస కూలీలను కాపాడే విషయంలో కేంద్రం విఫలమైందని విపక్షాలు ధ్వజమెత్తాయి. రాష్ట్రాల అధికారాల్లోకి చొరబడుతున్నారని కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ మొత్తం మీద సభ ఏకగ్రీవంగా బిల్లుకు ఆమోదం తెలిపింది.


ఆస్పత్రుల పారిశుద్ధ్య సిబ్బందికి, ఆశా వర్కర్లకు, కరోనా వారియర్స్‌గా పేరొందిన పోలీసులు, మున్సిపల్‌ సిబ్బందికి, కరోనా బాధితులకు ఇళ్లకు వెళ్లి సామగ్రి అందించే వారికి కూడా ఇదే రక్షణ కల్పించాలని విజ్ఞప్తులు వచ్చాయి. కొవిడ్‌ ప్రత్యేక చికిత్స పేరుతో అడ్డగోలుగా బిల్లులు వేస్తున్నారని, సంక్షోభాన్ని అవకాశంగా చేసుకున్నారని, దీనిపై నియంత్రణ ఉండాలని కొందరు సభ్యులు కోరారు. సిబ్బందిపై ఆసుపత్రి యాజమాన్యాల దౌర్జన్యాలు, వారికి సరైన రక్షణ కవచాలు ఇవ్వకపోవడం వంటి హింస గురించి చట్టంలో లేదని ప్రస్తావించారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్న ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్ల మీద చర్యలకు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేశామని మంత్రి చెప్పారు. ఓ ఆస్పత్రిలో శవాల కుప్పలు : కేకే

న్యూఢిల్లీ: కరోనా రోగుల నుంచి ప్రైవేటు కార్పొరేట్‌ ఆస్పత్రులు అధిక ఫీజులను బలవంతంగా వసూలు చేస్తున్నాయని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఆరోపించారు. సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో ఒక బాధితుడి నుంచి ఏకంగా రూ.90లక్షలు వసూలు చేశారని సభ దృష్టికి తెచ్చారు. ‘‘ఆసుపత్రుల్లో శవాల విషయమే తీసుకోండి. నేనో ఆస్పత్రికి వెళ్లినపుడు అక్కడ శవాలు కుప్పలుగా పడి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమో, రాష్ట్ర ప్రభుత్వమో, మరో ఏజెన్సీయో వాటిని చేపట్టే విధంగా యంత్రాంగం ఉండాలి’’ అని సూచించారు. లాక్‌డౌన్‌ సమయంలో కేంద్రం తప్పిదాలను కేకే ప్రస్తావించారు. వలస కార్మికులకు సొంత ఊరికి వెళ్లేందుకు సమయం ఇవ్వకుండా లాక్‌డౌన్‌ ప్రకటించారని మండిపడ్డారు. రాష్ట్రాలు డీల్‌ చేయాల్సిన అంశాల మీద నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినపుడు రాష్ట్రాలతో మాట్లాడాలని సూచించారు. 


Updated Date - 2020-09-20T07:29:10+05:30 IST