సుదర్శన్‌ టీవీ కేసులో.. తెలుగు మహిళ నీలిమ ఇంప్లీడ్‌

ABN , First Publish Date - 2020-09-25T07:10:45+05:30 IST

వివాదం రేపిన సుదర్శన్‌ టీవీ కేసులో ఇద్దరు కాంగ్రెస్‌ నేతల భార్యలు ఇంప్లీడ్‌ అయ్యారు...

సుదర్శన్‌ టీవీ కేసులో.. తెలుగు మహిళ నీలిమ ఇంప్లీడ్‌

  • కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా భార్య, మరో నేత భార్యతో కలిసి పిటిషన్‌


న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: వివాదం రేపిన సుదర్శన్‌ టీవీ కేసులో ఇద్దరు కాంగ్రెస్‌ నేతల భార్యలు ఇంప్లీడ్‌ అయ్యారు. వీరు కాంగ్రెస్‌ ప్రతినిధి పవన్‌ ఖేరా భార్య, సుప్రసిద్ధ రచయిత్రి, వ్యాసకర్త, పరిశోధకురాలు, జర్నలి స్టు, పెయింటర్‌ అయిన కోట నీలిమ.. ఇటీవలే గుండెపోటుతో మరణించిన కాంగ్రెస్‌ నేత రాజీవ్‌ త్యాగి భార్య సంగీత. దేశంలో కొన్ని వార్తా చానెళ్లలో చర్చాకార్యక్రమా లు నిర్వహిస్తున్న కొందరు యాంకర్లు, న్యూస్‌కాస్టర్లు అదే పనిగా ద్వేషాన్ని విరజిమ్ముతున్నారని, ప్రభుత్వ ఎజెండా ను మోస్తూ సమాజాన్ని కలుషితం చేస్తున్నారని, వారికి భావప్రకటనా స్వేచ్ఛ కింద సంశయలాభం ఇవ్వరాదని ఈ మహిళలిద్దరు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. దేశంలో ఎలకా్ట్రనిక్‌ మీడియా పరిస్థితి నాజీల నాటి జర్మనీని తలపిస్తోందని, ద్వేషమయ ప్రసంగాల వరకూ ఇది నిజమని ఘాటుగా విమర్శించారు. 


అర్ణాబ్‌ గోస్వామి, అమీష్‌ దేవగణ్‌, అంజనా ఓం కశ్యప్‌, ఆనంద్‌ నరసింహన్‌ మొదలైన యాంకర్లు అదేపనిగా ప్రభుత్వవిధానాలను ప్రచారం చేస్తూ, వాటిని వ్యతిరేకించేవారిని తీవ్రంగా దుర్భాషలాడుతూ, లేనిపోనివి అంటగడుతూ అప్రదిష్ట పాల్జేస్తున్నారని, చర్చా కార్యక్రమంలో ప్రారంభ వాక్యాల్లోనే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని కోట నీలిమ తన పిటిషన్‌లో తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘ఆర్టికల్‌ 19 ప్రకారం భావప్రకటనా స్వేచ్ఛను ఈ యాంకర్లు దుర్వినియోగం చేస్తున్నారు. చట్టసభలు ఓ చట్టం చేసేదాకా ఆర్టికల్‌ 32, 141, 142, 144 కింద ఈ చర్చాకార్యక్రమాల నియంత్రణకు ఆదేశాలివ్వాలని కోరుతున్నాను’ అని నీలిమ తన పిటిషన్‌లో అభ్యర్థించారు. విజయవాడకు చెందిన నీలిమ ప్రముఖ జర్నలిస్టు, రచయిత కేవీఎస్‌ రామశర్మ కుమార్తె. ఆమె అనేక పుస్తకాలు రాశారు. ప్రముఖ ఇంగ్లిషు వెబ్‌సైట్లలో, విదేశీ సైట్లలో, మేగజైన్లలో వ్యాసాలు రాస్తున్నారు. మంచి పెయింటర్‌ అయిన నీలిమ మహిళలు, పేద ప్రజానీక సమస్యలకు అద్దంపట్టే రచనలెన్నో చేశారు.యూపీఎస్సీ జిహాద్‌ పేరిట సుదర్శన్‌ టీవీలో ప్రసారం కానున్న కార్యక్రమం తీవ్ర దు మారం రేపింది. ‘బిందాస్‌ బోల్‌’ అనే ఈ షో ముస్లింలు కేంద్ర సర్వీసుల్లో, బ్యూరోక్రసీల్లో పథకం ప్రకారం నిండిపోతున్నారని ప్రోమోలో పేర్కొనడం వివాదం రేపింది.

Updated Date - 2020-09-25T07:10:45+05:30 IST