మీ వల్ల కాదు గానీ.. మేమే కమిటీ వేస్తాం
ABN , First Publish Date - 2020-12-17T07:46:12+05:30 IST
రైతులతో ప్రభుత్వం జరుపుతున్న చర్చల్లో ప్రతిష్టంభన ఎప్పటికీ తొలగకపోవడంతో సుప్రీంకోర్టు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఉభయపక్షాలూ తమ వైఖరులను మార్చుకోకుండా బిగదీసుక్కూచోవడంతో మధ్యే మార్గంగా తానే ఓ

మీ చర్చలు విఫలమవుతూనే ఉంటాయ్.. ఇది జాతీయ సమస్యగా మారే ప్రమాదం
కమిటీలో ప్రభుత్వం- రైతు సంఘాలు: సుప్రీం.. లాభం లేదన్న రైతు యూనియన్లు
ఇలాంటి కమిటీని ప్రభుత్వమే వేస్తానంది.. చట్టాల రద్దే ఏకైక పరిష్కారమన్న రైతులు
సమాంతర చర్చలొద్దని వినతి.. ఆందోళన ఒక రాష్ట్రానికే పరిమతం: తోమర్
తుపాకితో కణతపై కాల్చుకొని సిక్కు మత ప్రబోధకుడి ఆత్మహత్య
రైతుల ఆందోళనకు సంఘీభావంగా లేఖ.. ఢిల్లీ-సోనీపట్ సరిహద్దులో ఘటన
కమిటీలో ప్రభుత్వం- రైతు సంఘాలు
సుప్రీంకోర్టు నిర్ణయం
లాభం లేదన్న రైతు యూనియన్లు
న్యూఢిల్లీ, డిసెంబరు 16: రైతులతో ప్రభుత్వం జరుపుతున్న చర్చల్లో ప్రతిష్టంభన ఎప్పటికీ తొలగకపోవడంతో సుప్రీంకోర్టు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఉభయపక్షాలూ తమ వైఖరులను మార్చుకోకుండా బిగదీసుక్కూచోవడంతో మధ్యే మార్గంగా తానే ఓ కమిటీని ఏర్పాటుచేయాలని నిశ్చయించింది.
‘చూస్తూంటే మీరు జరుపుతున్న సంప్రదింపులు ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వడం లేదు. అవి విఫలమవుతాయి. మీ వల్ల కావడం లేదు. మేమే ఓ కమిటీని వేస్తాం. అందులో ఆందోళన జరుపుతున్న రైతుసంఘాల నుంచే కాక- దేశంలోని అన్ని రెతుసంఘాల నుంచి ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిఽధులు ఉంటారు. ఇది జరక్కపోతే ఈ సమస్య జాతీయ సమస్యగా మారే ప్రమాదముంది’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ బోబ్డే, జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ఽధర్మాసనం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు స్పష్టం చేసింది.
‘చర్చల్లో పాల్గొనే ప్రతినిధుల జాబితా తయారుచేసి ఇవ్వండి. ఆందోళనలపై వివిధ సంఘాల నుంచి పిటిషన్లు వేసిన రైతునేతలందరినీ ఈ కేసులో ఇంప్లీడ్ చేస్తున్నాం’ అని బెంచ్ వెల్లడించింది. అదే విధంగా ఆందోళన చేస్తున్న రైతులను రోడ్లపై నుంచి తొలగించి వాహనదారులకు కలుగుతున్న ఇబ్బందులను తీర్చాలంటూ రిషభ్ శర్మ అనే విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్‌పై వెంటనే సమాఽధానమివ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.
’రైతులతో చర్చలకు ఇప్పటికీ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అయితే ఈ ఆందోళన ఇపుడు రైతుల చేతిలో నుంచి వేరే వ్యక్తుల చేతిలోకి వెళ్లిపోయింది. చర్చలకు వస్తూనే ఆ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ దగ్గరే రైతులు ఆగిపోతున్నారు. ప్రభుత్వం రైతు ప్రయోజనాలకు విరుద్ధంగా ఏమీ చేయదు. ప్రభుత్వంతో చర్చలు జరిపేట్లు కోర్టు వారికి ఆదేశాలివ్వాలి. క్లాజుల వారీగా చర్చిందేందుకు సిద్ధం’ అని మెహతా తెలియపర్చారు.
చిత్తశుద్ధితో చర్చలు జరిపే వ్యక్తు లు, సంస్థలు రెండు పక్షాల్లోనూ ఉండాలి. చర్చలకు సిద్ధంగా ఉన్న యూనియన్లేంటో మొదట గుర్తించండి’ అని జస్టిస్ బోబ్డే సూచించారు. కేసును గురువారానికి వాయిదా వేసింది. అయి తే సుప్రీంకోర్టు నిర్ణయంపై రైతు సంఘాలు పెదవి విరిచాయి. ఇలాంటి కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం మొదట్లోనే సుముఖత చూపిందని, దాన్ని ఆనాడే తాము తిరస్కరించామని, ఇపుడు సుప్రీంకోర్టు అదే ప్రతిపాదనతో ముందుకువస్తోందని, దీని వల్ల లాభం లేదని పేర్కొన్నాయి.
‘ఈ కమిటీని బిల్లుల రూపకల్పనకు ముందే వేయాల్సింది... చట్టాల ఆమోదం తరువాత కాదు...’ అని నిరసనలో ఉన్న, 40 యూనియన్లలో ఒకటైన రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సభ నేత అభిమన్యు కొహర్ అన్నారు. ‘ఇంకో విషయం ఏంటంటే.. సుప్రీంకోర్టు అన్ని రైతుసంఘాలతో కమిటీ ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వం ఇప్పటికే 35 సంఘాల నేతలతో ఐదురౌండ్ల చర్చలు జరిపింది. అంటే ఇక్కడ ఉన్నదీ ప్రభుత్వ, రైతుసంఘాల ప్రతినిధులే. మరేంటి తేడా? కొత్త కమిటీ చేసేదేముంటుంది? ఇపుడు కావాల్సిందల్లా చట్టాల రద్దు. అది జరగనంత వరకూ ఈ ప్రతిష్టంభన వీడదు’ అన్నారు.
‘సుప్రీం చేయాల్సినది చట్టాల రద్దు కాదు. చట్టాల రాజ్యాంగబద్ధతను తేల్చడం. ఈ పనిని సుప్రీంకోర్టే చేయగలదు. చట్టాల అవసరం, సాధ్యాసాధ్యాలు సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశం కాదు. వాటిని రైతులు, ప్రభుత్వాధినేతలు చూసుకుంటారు. సుప్రీం పర్యవేక్షణలో చర్చలు జరగాలన్నది తప్పుడు మార్గం’ అని స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్ ట్విటర్‌లో అభిప్రాయపడ్డారు. టిక్రీ సరిహద్దు పాయింట్ వద్ద రైతుల ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న భారతీయ కిసాన్ యూనియన్(ఏక్‌తా ఉగ్రహాన్) కూడా ఈ కమిటీ ఏర్పాటును వ్యతిరేకించింది.
అయితే సుప్రీం పిలిస్తే తాము చర్చలకు వెళతామ ని, ఏ విషయమూ యూనియన్లు చర్చించి నిర్ణయిస్తాయని బీకేయూ నేతల్లో ఒకరైన రాకేశ్ తికాయత్ చెప్పారు. కాగా- ప్రభుత్వం కొన్ని రైతు సంఘాలతో ప్రతీరోజూ విడిగా చర్చలు జరపడాన్ని సంయుక్త కిసాన్ మోర్చా నిరసించింది. వివిధ రాష్ట్రాల యూనియన్లతో సమాంతర చర్చలు మానుకోవాలని మోర్చా కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్‌కు పంపిన లేఖలో కోరింది.
21వ రోజూ నిరసన
రైతులు 21వ రోజు కూడా తమ నిరసన కొనసాగించారు. ఢిల్లీ- నొయిడా మార్గంలోని చిలియా సరిహద్దు పాయింట్‌ను దిగ్బంధించడంతో కొన్ని గంటలపాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిలియా పాయింట్‌ను డిసెంబరు 1 నుంచి దాదాపుగా మూసేశారు. అపుడపుడూ తెరుస్తున్నారు.
