అధిష్ఠానం సమ్మతిస్తే పైలట్‌ను స్వాగతిస్తాం: గెహ్లాట్

ABN , First Publish Date - 2020-08-01T22:05:18+05:30 IST

రాజస్థాన్ సంక్షోభంపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి..

అధిష్ఠానం సమ్మతిస్తే పైలట్‌ను స్వాగతిస్తాం: గెహ్లాట్

జైసల్మేర్: రాజస్థాన్ సంక్షోభంపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, ఆయన వర్గీయులు తిరిగి పార్టీలోకి రావడానికి కాంగ్రెస్ అధిష్ఠానం అనుమతిస్తే తాము స్వాగతిస్తామని తెలిపారు. రెబల్స్‌ను స్వాగతిస్తామని, అధిష్ఠానం నిర్ణయమే తమకు శిరోధార్యమని ఆయన చెప్పారు.


జైసల్మేర్‌‌లో శనివారంనాడు మీడియాతో గెహ్లాట్ మాట్లాడుతూ, రాజస్థాన్‌లో నడుస్తున్న 'తమాషా'కు ప్రధాని ఇప్పటికైనా తెరదించాలని అన్నారు. 'ఇక్కడ ఎమ్మెల్యేలతో బేరసారాల వ్యవహారం అంతకంతకూ పెరుగుతోంది. ఇదేం తమాషా?' అని నిలదీశారు.


సంజీవనీ కోఆపరేటివ్ సొసైటీ కుంభకోణంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకాషత్ పేరు వెలుగులోకి వచ్చిందని, షెకావత్ ప్రమేయంపై విచారణ జరపాలని రాజస్థాన్ కోర్టు కూడా ఎస్ఓజీని ఆదేశించిందని గెహ్లాట్ చెప్పారు. ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతున్న ఆడియో టేపులో ఆయన గొంతు వినిపిస్తోందని, షెకావత్‌కు ఇంకెంతమాత్రం మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని అన్నారు. తక్షణం ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలని గెహ్లాట్ డిమాండ్ చేశారు.


కాగా, ఈనెల 14 నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ ఆహ్వానించడం, తాము హాజరవుతామని పైలట్ చెప్పడంతో రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. గెహ్లాట్‌కు 99 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2020-08-01T22:05:18+05:30 IST