కోవిడ్-19 సామాజిక వ్యాప్తి మన దేశంలో లేదు : ఐసీఎంఆర్

ABN , First Publish Date - 2020-03-19T21:24:15+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి గురించి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శుభవార్త చెప్పింది. కోవిడ్-19 వ్యాధి మన దేశంలో సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్) జరగలేదని, అన్ని నమూనా పరీక్షల్లోనూ నెగెటివ్ అనే ఫలితాలు వచ్చాయని తెలిపింది.

కోవిడ్-19 సామాజిక వ్యాప్తి మన దేశంలో లేదు : ఐసీఎంఆర్

న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి గురించి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శుభవార్త చెప్పింది. కోవిడ్-19 వ్యాధి మన దేశంలో సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్) జరగలేదని, అన్ని నమూనా పరీక్షల్లోనూ నెగెటివ్ అనే ఫలితాలు వచ్చాయని తెలిపింది. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ మన దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ అవుతున్నట్లు ఆధారాలు లేవని పేర్కొంది. 


ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ గురువారం మాట్లాడుతూ, ‘‘అత్యంత తీవ్ర శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్ల కోసం పరీక్షించిన అన్ని యాధృచ్ఛిక నమూనాలు (రాండమ్ శాంపిల్స్) కోవిడ్-19 నెగెటివ్ అని తేలింది. దీనినిబట్టి భారత దేశంలో ఇప్పటి వరకు కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరగలేదని తెలుస్తోంది’’ అని తెలిపారు.


మన దేశంలో కరోనా వైరస్ కారణంగా ముగ్గురు మరణించారు. 166 మందికి ఈ వైరస్ పాజిటివ్ అని నిర్థరణ అయింది.


సామాజిక వ్యాప్తి ఎప్పుడు జరుగుతుందంటే, ఓ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్థరణ అయి, ఆ ఇన్ఫెక్షన్ ఆ వ్యక్తికి ఏ విధంగా సోకిందో వైద్యులు గుర్తించే అవకాశం లేనపుడు సామాజిక వ్యాప్తి జరిగినట్లు చెబుతారు. రోగ నిర్థారణ చేయించుకొనని, వ్యాధి లక్షణాలు పైకి కనిపించని వ్యక్తులు జాడ తెలియకుండా ఉంటూ, ఈ ఇన్ఫెక్షన్‌కు కారకులైనపుడు ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి వచ్చినపుడు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం కష్టమవుతుంది. 


ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఐసీయూ)లలో తీవ్రమైన శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారి నుంచి రాండమ్ శాంపిల్స్‌ను సేకరించి, ఐసీఎంఆర్ ఈ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరగలేదని నిర్థరణ అయింది. ఇతర దేశాలకు వెళ్ళి, వచ్చిన చరిత్ర లేనివారి నుంచి, కరోనా వైరస్ పాజిటివ్ రోగులతో ఎటువంటి సంబంధాలు లేనటువంటి రోగుల నుంచి ఈ శాంపిల్స్ తీసుకున్నారు.


మార్చి 15 నుంచి మొత్తం 1,000 శాంపిల్స్‌ను సేకరించగా, అన్ని శాంపిల్స్‌ కోవిడ్-19 నెగెటివ్ అని నిర్థరణ అయిందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ భార్గవ చెప్పారు. మరిన్ని వివరాలను ఐసీఎంఆర్ విడుదల చేయబోతోందని తెలిపారు. 


Updated Date - 2020-03-19T21:24:15+05:30 IST