కొత్త కరోనా టెస్టింగ్ కిట్లపై రాష్ట్రాలకు ఐసీఎంఆర్ సంచలన ఆదేశాలు..

ABN , First Publish Date - 2020-04-21T23:21:14+05:30 IST

కొవిడ్-19 పరీక్షల కోసం కొత్తగా అందుబాటులోకి వచ్చిన రాపిడ్ టెస్ట్ కిట్లను రెండు రోజుల పాటు వినియోగించరాదంటూ...

కొత్త కరోనా టెస్టింగ్ కిట్లపై రాష్ట్రాలకు ఐసీఎంఆర్ సంచలన ఆదేశాలు..

న్యూఢిల్లీ: కొవిడ్-19 పరీక్షల కోసం కొత్తగా అందుబాటులోకి వచ్చిన రాపిడ్ టెస్టింగ్ కిట్లను రెండు రోజుల పాటు వినియోగించరాదంటూ భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆదేశించింది. ఈ కిట్ల ద్వారా తప్పుడు ఫలితాలు వస్తున్నాయంటూ ఫిర్యాదు వచ్చినందున ప్రస్తుతానికి రాష్ట్రాలు వాటిని ఉపయోగించవద్దని సూచించింది. ఈ మేరకు ఐసీఎంఆర్ అంటువ్యాధుల విభాగం చీఫ్ డాక్టర్ రమణ్ ఆర్ గంగాఖేడ్కర్  ఇవాళ ఓ ప్రకటన చేశారు. ‘‘రెండు రోజుల పాటు రాష్ట్రాలు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ఉపయోగించవద్దు. చాలా వ్యత్యాసాలు ఉన్నందున, కొత్త కిట్లను పరీక్షించి, ధ్రువీకరించాల్సి ఉంది. అనంతరం వచ్చే రెండ్రోజుల్లో మళ్లీ దీనిపై మార్గదర్శకాలు విడుదల చేస్తాం..’’ అని గంగాఖేడ్కర్ పేర్కొన్నారు.


కరోనా వైరస్ పరీక్షల్లో కొత్త కిట్లు కేవలం 5.4 కచ్చితత్వాన్ని మాత్రమే చూపిస్తున్నాయంటూ.. రాజస్థాన్ ప్రభుత్వం వీటి వాడకాన్ని నిలిపివేసిన నేపథ్యంలో ఐసీఎంఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కిట్లలో పాజిటివ్ పేషెంట్లకు కూడా నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయంటూ  రాజస్థాన్ ఆరోగ్య మంత్రి రఘుశర్మ ఆరోపించారు. కాగా ఐసీఎంఆర్ దేశ వ్యాప్తంగా వివిధ అనుబంధ ల్యాబ్‌ ద్వారా ఇప్పటి వరకు 4,49,810 కరోనా శాంపిళ్లను పరీక్షించింది. 

Updated Date - 2020-04-21T23:21:14+05:30 IST