భారత్‌కు చేరిన బోయింగ్ హెలికాప్టర్లు
ABN , First Publish Date - 2020-07-10T22:16:05+05:30 IST
ఒప్పందం ప్రకారం భారత్‌కు యుద్ధ హెలికాప్టర్లనన్నింటినీ అందజేసినట్లు బోయింగ్ వెల్లడించింది. ఏహెచ్-64ఈ అపాచీ, సీహెచ్-47ఎఫ్(ఐ) చినూక్ వేరియంట్లకు...

న్యూఢిల్లీ: ఒప్పందం ప్రకారం భారత్‌కు యుద్ధ హెలికాప్టర్లనన్నింటినీ అందజేసినట్లు బోయింగ్ వెల్లడించింది. ఏహెచ్-64ఈ అపాచీ, సీహెచ్-47ఎఫ్(ఐ) చినూక్ వేరియంట్లకు చెందిన హెలికాప్టర్ల కోసం నాలుగేళ్ల క్రితం భారత్‌తో ఒప్పందం కుదిరిందని, అందులో భాగంగా ఆఖరి 5 హెలికాప్టర్లను ఇటీవల అందజేశామని బోయింగ్ తెలిపింది. ఈ మేరకు బోయింగ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్ర అహుజా మాట్లాడుతూ, తాము సరఫరా చేసిన హెలికాప్టర్లు చాలా శక్తిమంతమైనవని, అమెరికా కూడా వీటినే వినియోగిస్తోందని చెప్పారు. వీటిని భారత్‌కు అందించడం ఆనందంగా ఉందని, భారత్‌తో కలిసి పనిచేసేందుకు ఎల్లప్పుడూ బోయింగ్ ముందుంటుందని చెప్పారు.
ఈ హెలికాప్టర్లు భారత వాయుదళంలో చేరడంతో భారత వాయుసేన మరింత పటిష్ఠమైంది. అంతేకాకుండా భారత్‌కు చేరిన హెలికాప్టర్లు చాలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో తయారు చేయబడినట్లు బోయింగ్ విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం తెలుస్తోంది. ముఖ్యంగా ఏహెచ్-64ఈ అపాచీలో ఓపెన్ ఆపరేటింగ్ సిస్టం ఆర్కిటెక్చర్ వ్యవస్థ ఉన్నట్లు సమాచారం. దానితో పాటు సరికొత్త కమ్యూనికేషన్ వ్యవస్థ, నావిగేషన్, సెన్సార్లు, ఆయుధ వ్యవస్థలు అమర్చినట్లు తెలుస్తోంది. పగలు, రాత్రి తేడాలేకుండా లక్ష్యాన్ని ఛేదించేందుకు అవసరమైన ఎంటీఏడీఎస్(మోడ్రనైజ్డ్ టార్గెట్ అక్విసిషన్ డిసిగ్నేషన్ సిస్టం)తో పాటు నైట్ విజన్ వ్యవస్థ ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఫైర్ కంట్రోల్ రాడార్ వంటి మరిన్ని వసతులతో ఓ కంమాండర్‌కు కావాల్సిన సౌకర్యాలన్నింటినీ అమర్చినట్లు బోయింగ్ తెలియజేసింది.
ఇదిలా ఉంటే మొత్తం 22 ఏహెచ్-64ఈ అపాచీ హెలికాప్టర్లు, 15 సీహెచ్-47ఎఫ్(ఐ) చినూక్ హెలికాప్టర్ల కోసం భారత రక్షణ శాఖ 2015 సెప్టెంబరులో బోయింగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం అన్నింటినీ బోయింగ్ అందజేసింది. 22 చినూక్ హెలికాప్టర్లలో చివరి 5 హెలికాప్టర్లను మార్చిలో ఐఏఎఫ్‌కు అందించినట్లు బోయింగ్ వెల్లడించింది. అయితే అపాచీ హెలికాప్టర్లలో కూడా ఓ ఐదింటిని అందించాల్సి ఉండగా.. వాటిని కూడా ఇటీవల ఐఏఎఫ్‌కు సరఫరా చేసినట్లు తెలిపింది.