మాతో పెట్టుకుంటే మీకే నష్టం : చైనాకు భారత్ హెచ్చరిక

ABN , First Publish Date - 2020-12-30T00:32:50+05:30 IST

భారత దేశంతో ఘర్షణ పడటం అంతర్జాతీయంగా చైనాకు

మాతో పెట్టుకుంటే మీకే నష్టం : చైనాకు భారత్ హెచ్చరిక

న్యూఢిల్లీ : భారత దేశంతో ఘర్షణ పడటం అంతర్జాతీయంగా చైనాకు శ్రేయస్కరం కాదని భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బడౌరియా హెచ్చరించారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో ఆయన ఈ హెచ్చరిక చేశారు. మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 


భారత్-చైనా మధ్య ఏదైనా తీవ్రమైన ఘర్షణ జరగడం అంతర్జాతీయ స్థాయిలో చైనాకి శ్రేయస్కరం కాదని చెప్పారు. చైనీయుల ఆకాంక్షలు అంతర్జాతీయ స్థాయిలో ఉంటే, ఇది వారి గ్రాండ్ ప్లాన్‌కు తగదని తెలిపారు. ఉత్తరాదిలో వారి చర్యలకు లక్ష్యాలు ఏమై ఉంటాయని ప్రశ్నిస్తూ, వారు నిజంగా సాధించినదేమిటో మనం గుర్తించడం ముఖ్యమని చెప్పారు. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దళాలు భారీగా ఉన్నాయని, పెద్ద ఎత్తున రాడార్లు, భూమి ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మిసైల్స్‌ను మోహరించారన్నారు. చైనీయుల మోహరింపు బలంగా ఉందన్నారు. దీనిని ఎదుర్కొనడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకున్నామని చెప్పారు.


చైనా విధానాల్లో పాకిస్థాన్ ఓ పావుగా మారిపోయిందని దుయ్యబట్టారు. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ సంబంధిత అప్పుల ఊబిలోకి పాకిస్థాన్ కూరుకుపోతోందన్నారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ తర్వాత పాకిస్థాన్ ద్వారా ఆఫ్ఘనిస్థాన్ చేరేందుకు చైనాకు అవకాశాలు పెరిగాయన్నారు. 


Updated Date - 2020-12-30T00:32:50+05:30 IST