బిర్యానీ ఆర్డర్ చేసి రూ.50 వేలు పోగొట్టుకున్న హైదరాబాద్ టెకీ!

ABN , First Publish Date - 2020-02-12T20:33:38+05:30 IST

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌ జుమాటోలో బిర్యానీ కోసం ఆర్డర్ చేసిన ఓ టెకీకి ఊహించని అనుభవం ఎదురైంది. ..

బిర్యానీ ఆర్డర్ చేసి రూ.50 వేలు పోగొట్టుకున్న హైదరాబాద్ టెకీ!

హైదరాబాద్: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌ జుమాటోలో బిర్యానీ కోసం ఆర్డర్ చేసిన ఓ టెకీకి ఊహించని అనుభవం ఎదురైంది. రూ.200 రీఫండ్ కోసం అతడు సాగించిన  ప్రయత్నాలు చివరికి రూ.50 వేల రూపాయలు పోగొట్టుకునేలా చేశాయి. ఆన్‌లైన్ వినియోగదారులను విస్మయానికి గురిచేస్తున్న ఈ ఘటనపై వివరాల్లోకి వెళితే.. 

రెండ్రోజుల క్రితం జూబిలీహిల్స్ సమీపంలోని రహ్మత్ నగర్‌కు చెందిన ఓ టెకీ జుమాటో యాప్‌లో చికెన్ బిర్యానీ కోసం ఆర్డర్ చేశాడు. అయితే బిర్యానీ బదులు ‘సాంబర్ రైస్’ రావడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అతడు.. జుమాటో కస్టమర్ కేర్ నంబర్ కోసం ఇంటర్నెట్‌లో వెతికాడు. ఓ నంబర్ కనిపించడంతో దానికి కాల్ చేసి తన గోడు చెప్పుకున్నాడు. అయితే తాను చూసిన నంబర్ ఫిషింగ్ పేజీలోదనీ.. అవతల ఉన్నది సైబర్ మోసగాళ్లు అనీ అతడు పసిగట్టలేకపోయాడు. టెకీ చెప్పిందంతా చక్కగా విన్న మోసగాళ్లు.... అతడికి రీఫండ్ ఇస్తామంటూ నమ్మబలికారు. అతడికి పేటీఎం నంబర్ ఉందని తెలుసుకుని తమ సూచనలు పాటించాలంటూ ఒప్పించారు.

పేటీఎం వివరాలు తీసుకున్న తర్వాత.. ‘‘రీఫండ్ ప్రోసెస్’’ అంటూ తప్పుదోవ పట్టించారు. ‘‘ప్రొసీడ్ టు పే’’ అనే సందేశం వచ్చిన తర్వాత... తనకు డబ్బులు వస్తాయేమోనన్న ఆశతో వాళ్లు చెప్పినట్టే టెకీ చేశాడు. అయితే తమ వద్ద ఎర్రర్ వస్తోందనీ.. మళ్లీ తాము చెప్పినట్టు చేయాలంటూ మూడు సార్లు అదే ప్రక్రియ సాగించారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక గానీ బాధితుడికి తన ఖాతా నుంచి రూ.50 వేలు పోగొట్టుకున్న సంగతి తెలియలేదని హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ పేర్కొన్నారు. కస్టమర్ కేర్ సేవల కోసం అనధికార వెబ్‌సైట్లపై ఆధారపడవద్దంటూ ఆయన హెచ్చరించారు. బాధితుడు తన యాప్‌లోనే స్వయంగా ఫిర్యాదు చేయాల్సిందన్నారు. ఈ ఘటనపై ఐపీసీ 420తో పాటు ఐటీ చట్టం 66సీ, 66డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు తెలిపారు. 

Updated Date - 2020-02-12T20:33:38+05:30 IST