మనోళ్ల ఆకలి కేకలు

ABN , First Publish Date - 2020-04-18T07:39:46+05:30 IST

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు దుబాయి అతలాకుతలమవుతోంది. ఇతర గల్ఫ్‌ దేశాలతో పోలిస్తే దుబాయిపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. పలు సంస్థలు ఇప్పటికే దివాలా తీశాయి.

మనోళ్ల ఆకలి కేకలు

  • కరోనాతో దుబాయిలో రోడ్డునపడ్డ ప్రవాసీయులు


(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు దుబాయి అతలాకుతలమవుతోంది. ఇతర గల్ఫ్‌ దేశాలతో పోలిస్తే దుబాయిపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. పలు సంస్థలు ఇప్పటికే దివాలా తీశాయి. ఉద్యోగాల కోసం వచ్చిన అనేక మంది తెలుగు ప్రవాసీయులు వీధుల పాలయ్యారు. దీనికితోడు వ్యాపార, పరిశ్రమలు ఆశలు పెట్టుకున్న ప్రతిష్ఠాత్మక దుబాయి 2020ను ప్రభుత్వం వాయిదా వేయడం, నూతన ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టడంతోపాటు పురోగమనంలో ఉన్న ప్రాజెక్టుల వ్యయంలో కోత విధించాలని దుబాయి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వాటిపై ఆధారపడ్డ్డ వేలాది మంది తెలుగు ప్రవాసీయులను నట్టేట ముంచింది.


ఇప్పటివరకు అక్కడక్కడ చిన్నా చితకా పనులు చేసుకుంటూ గడిపిన తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ఇప్పుడు.. పనుల్లేక, ఆదాయం లేక, పూట గడవని స్థితిలో ఉన్నారు. వీరికితోడు వివిధ నూతన ప్రాజెక్టుల పనుల కోసం తీసుకొచ్చిన వేలాది మంది ప్రవాసీయులకు అనేక సంస్థలు చేదు కబురు చెబుతున్నాయి. ఒక ప్రముఖ సంస్థలో పని చేయడానికి వచ్చిన తెలుగు వారితో సహా 800 మంది భారతీయులకు ఇక తమ వద్ద పని లేదంటూ ఆ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో దళారులకు డబ్బు ఇచ్చి వచ్చిన తమ భవితవ్యం ఏమిటంటూ బాధితులు ప్రశ్నిస్తున్నా.. వినే నాథుడే కరువయ్యాడు.


సంస్థ యజమాని పరారు..

మరో సంస్థ దివాలా తీయడంతో యాజమాని పారిపోయినట్లు తెలుసుకొని అందులో పని చేయడానికి వచ్చిన అనేక మంది తెలంగాణ ప్రవాసీయులు నిర్ఘాంతపోయారు. సోనాపూర్‌లో చెట్ల కింద ఆకలితో అలమటిస్తుండగా గల్ఫ్‌ అవగాహన వేదిక అధ్యక్షుడు ధోనికేని కృష్ణ ఆధ్వర్యంలో భారతీయ కాన్సులేట్‌ మద్దతుతో వీరికి ఆహారం అందించి, తాత్కాలిక వసతికి తరలించారు. వీరిలో వికారాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌తోపాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు ఉన్నారు. తెలంగాణ జిల్లాలకు చెందినవారు అనేక మంది ఇక్కడ లేబర్‌ను సప్లయ్‌ చేస్తుంటారు, ఒక రకంగా మనుషుల అక్రమ రవాణా వ్యాపారం ఇది. ఇప్పుడు పనుల్లేక, సైట్లు తగ్గడంతో వీరిలో అనేకుల ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయి. 

Updated Date - 2020-04-18T07:39:46+05:30 IST